
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాకిస్థాన్ సైనికపరంగా ప్రమాదకరంగానే ఉందని భారత త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ శతాబ్దంలో దేశానికి ఎదురైన కొన్ని అతి పెద్ద భద్రతా సవాళ్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్థాన్‌తో ముప్పు ఉందా’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘సాయుధ బలగాల విషయంలో అస్థిరమైన సరిహద్దు సమస్య రూపంలో చైనాతో మనకు తక్షణ సమస్య ఎదురవుతోంది. భౌగోళికంగా దగ్గరగా ఉన్న ఇద్దరు పొరుగువారూ (చైనా, పాకిస్థాన్) మనకు విరోధులే. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాక్ సైన్యంతో ముప్పు అలానే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఎంతోకాలంగా మన దేశానికి హిమాలయాలు రక్షణాత్మకంగా నిలిచాయని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. పెరిగిన సాంకేతికత కారణంగా సరిహద్దుల్లో సమస్యలు సృష్టించే దేశాలకు హిమాలయాలు ఇకపై అడ్డంకి కావని, ఆ అస్థిరతను అడ్డుకోవడానికి తాము వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు.





