News

అహోబిలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

239views

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగువ అహోబిలంలో అంకురార్పణతో పది రోజుల పాటు జరగనున్నాయి. దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం భగవంతుడికి సంవత్సరంలో ఒకసారి మహోత్సవాలను బ్రహ్మ నిర్వహించాలనే నియమం ప్రకారం ఎగువ అహోబిలంలో ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు నిర్వహిస్తారు. మరుసటి రోజు దిగువ అహోబిలంలో పూర్తి చేస్తారు.

ఎప్పుడెప్పుడంటే….?
ఎగువ అహోబిలంలో నేటి నుంచి 25 వరకు ఉత్సవాలు జరగనుండగా, దిగువలో మార్చి 16 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. మార్చి 27 నుంచి 29 వరకు స్వామి తెప్పోత్సవం జరగనుంది. లక్ష మంది భక్తులకు సరిపోయేలా ఇప్పటికే లడ్డూల తయారీ ప్రారంభమైంది.

చేస్తున్నారిలా…!
ఆలయ పరిసరాల్లో శుభ్రత పనులు చేపడుతున్నారు. చలువ పందిర్లు, సంచార మరుగుదొడ్ల సదుపాయం, క్యూలైన్లు, భక్తులకు ఉచిత దర్శనంతో పాటు రూ.50 టికెట్‌ ధరతో శీఘ్రదర్శనం, వాహనాల నిలుపుదలకు స్థలాలు సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా 62 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 25 నీటి ట్యాంకర్లతో పాటు పారిశుద్ధ్య పనుల కోసం జోన్ల వారీగా విభజించి 12 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఎగువ, దిగువ ఆలయాల పరిధిలో ఉన్న నీటి ట్యాంకులకు మరమ్మతులతో పాటు మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు వీలుగా గదుల్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఏయే కార్యక్రమాలంటే…?
ఎగువ అహోబిలంలో మార్చి 15న ఉత్సవాలకు అంకురార్పణ, 16న ధ్వజారోహణం, సింహవాహనసేవ, దిగువలో సాయంత్రం అంకురార్పణ, 17న ఎగువలో హంసవాహన, సూర్యప్రభ వాహనసేవ, దిగువలో ధ్వజారోహణం, సింహవాహనసేవ, 18న ఎగువలో ఉత్సవం, హనుమంతవాహనం, దిగువలో హంసవాహనం, సూర్యప్రభ, 19న ఎగువలో శేషవాహనం, చంద్రప్రభ వాహనం, దిగువలో యోగానృసింహగరుడ విమానం, హనుమంత వాహనం, 20న ఎగువలో ఉత్సవం, శరభవాహనం, దిగువలో శేషవాహనం, చంద్రప్రభ వాహనం, 21న ఎగువలో ఉత్సవం, పొన్నచెట్టువాహనం, దిగువలో మోహినీ అలంకారం, శరభవాహనం, 22న ఎగువలో తిరుమంజనం, గజవాహనం, రాత్రి కల్యాణ్సోతవం, దిగువలో వేణుగోపాలస్వామి అలంకారం, పొన్నచెట్టు వాహనం, 23న ఎగువలో తొట్టితిరుమంజనం, అశ్వవాహనం, దిగువలో అభిషేకం, గజవాహనం, రాత్రి కల్యాణోత్సవం, 24న ఎగువలో రథోత్సవం, దిగువలో కాలింగనర్ధనోత్సవం, తొట్టి తిరుమంజనం, అశ్వవాహనం, 25న ఎగువలో ఉత్సవం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణం, దిగువలో రథోత్సవం, 26న దిగువలో ఉత్సవం, రాత్రి గరుడోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.