
అనకాపల్లి జిల్లాలో 76 దేవాలయాలు నిర్మాణానికి రూ.7.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆదివారం చెప్పారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నుంచి ఒక్కో దేవాలయానికి రూ.10లక్షలు చొప్పున ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులు దేవదాయ, ధర్మదాయశాఖ పర్యవేక్షణలో జరుగుతాయని ధర్మశ్రీ చెప్పారు. టీటీడీ చేపట్టిన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ దేవాలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటిలో చోడవరం నియోజకవర్గంలోనే 16 దేవాలయాలకు రూ.కోటి 60లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. చోడవరం మండలంలో షిర్డిసాయిబాబా ఆలయం (నర్సయ్యపేట), ముత్యామాంబ ఆలయం (జి.జగన్నాథపురం), రామాలయం (గోవాడ బీసీకాలనీ), శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం (చోడవరం) నిధు లు మంజూరయ్యాయన్నారు. బుచ్చెయ్యపేట మండలంలో చిట్టియ్యపాలెం, మల్లాం బీసీ కాలనీ ల్లో రామాలయాలు, రావికమతం మండలంలో గుడ్డిప, ఎల్.పొన్నవోలు, రోలుగుంట మండలంలో కె.నాయుడుపాలెం, వెదుల్ల వలస, వడ్డిప, జె.నాయుడుపాలెం, శరభవరం, అంట్లపాలెం, రోలుగుంట గ్రామాల్లో నూతనంగా రామాలయాలు నిర్మాణానికి నిధులు వచ్చాయన్నారు. త్వరలోనే నిర్మాణాలు చేపడతారని ధర్మశ్రీ చెప్పారు.





