
తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ నేతలు పబ్బం గడుపుకొంటున్నారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలో ఆనందాశ్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల కొండపై డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ జీడినెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమార్తెను సీఎం జగన్ ప్రకటించడం సంతోషంగా ఉందని మాట్లాడటం తగదని, ఇందుకు హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువుల ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థ అని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఇక్కడ పెద్దపీట వేయాలని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేదికగా మార్చి వెంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను, ధార్మికతను నాశనం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారి కూడా బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా హాజరుకాకుండా హిందువులు, ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి భక్తులను అవమానించారన్నారు. నారాయణస్వామి తిరుమలను రాజకీయ వేదికగా మలుచుకోవడం క్షమించరాని నేరమన్నారు. తిరుమల పవిత్రతను దిగజారుస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.





