News

గుడిలో జీర్ణోద్ధరణ పనులు, బయటపడిన పంచలోహ విగ్రహాలు

264views

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కూర్మాయి గ్రామం వద్ద కూర్మవరదరాజ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల సందర్భంగా ఆదివారం పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి.

గర్భగుడి పునాదులను ఎక్స్‌కవేటర్‌ సాయంతో తవ్వుతుండగా ఒక విగ్రహం తాలూకు తల కనిపించింది. జాగ్రత్తగా తవ్వి వెలికి తీయగా సుమారు 2.5 అడుగుల ఎత్తుగల శంఖం, చక్రం ధరించిన మహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలతో పాటు పూజా కార్యక్రమాలకు వినియోగించే లోహ వస్తువులూ బయట పడ్డాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కౌండిన్య నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహమ్మదీయుల దండయాత్ర నుంచి ఆలయాన్ని కాపాడే నేపథ్యంలో నాటి గ్రామస్థులు కూర్మ వరదరాజ స్వామి ఆలయాన్ని ఇసుక, మట్టితో కప్పేసినట్లు పెద్దలు చెబుతున్నారు.

1950లో కర్ణాటక రాష్ట్రం నంగిలి సమీపంలోని కరిడిగానిపల్లికి చెందిన చెంగారెడ్డి అనే మోతుబరి రైతు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా పొలిమేరల్లోని మట్టి, ఇసుక కింద ఆలయ శిఖరాన్ని గుర్తించినట్లు చెబుతారు. అలా బయటపడిన ఆలయం.. పురాతన దశకు చేరింది. దీనిని జీర్ణోద్ధరణ చేసేందుకు దేవదాయశాఖ గతేడాది రూ.1.25 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ.25 లక్షలు గ్రామస్థులు, దాతలు భరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టన జీర్ణోద్ధరణ పనుల్లో పంచలోహ విగ్రహలు.. పూజాసామగ్రి బయటపడ్డాయి. కూర్మవరదరాజస్వామి విగ్రహం భద్రపరచిన చోటనే వీటినీ ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కాగా, మహమ్మదీయుల దండయాత్ర సందర్భంగా ఈ విగ్రహాలను నాడు గ్రామస్తులు గర్భగుడి కింద పూడ్చి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు భద్రత కల్పించి, జీర్ణోద్ధరణ ముగిశాక ఆలయంలో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.