News

తెలుగుభాష అత్యున్నతం, అమృతతుల్యం

277views

తెలుగుభాష ఎంత అత్యున్నతమైనదో.. అమృత తుల్యమో.. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే తెలుస్తుందని రచయితలు పేర్కొన్నారు. ఏదేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని.. అన్నట్లుగా తెలుగు భాషాభివృద్ధికి ఎందరో కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కాకినాడలో నిర్వహిస్తున్న అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారేమన్నారంటే..

భాషపై పట్టుతోనే సాహిత్య ఆస్వాదన
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి వచ్చాం. ఇక్కడ అచ్చతెలుగులో ప్రసంగాలు సాగాయి. తెలుగు భాషను విస్మరించకండి.. ఇది మీ భాష అంటూ చిన్నారులకు నేర్పించాలి. మనమంతా కృషి చేసి భాషను విరివిగా వాడుకలోకి తేవాలి. అందుకోసం ఏ సాయం చేయడానికైనా సిద్ధం. భాషపై పట్టుంటే తప్ప సాహిత్యాన్ని ఆస్వాదించలేం. చక్కని పాట విన్నా, కవిత్వం విన్నా అందులోని భాష భావాలు తెలిస్తేనే ఆనందించగలం. ప్రాథమిక తరగతుల్లో తెలుగు భాష నేర్పిస్తే భాషపై పట్టు వస్తుంది.గునుపూడి సుబ్బారావు, అపర్ణ, శాన్‌ఫ్రాన్సిస్‌కో

మన భాష నేర్పించడం ముఖ్యోద్దేశం
2002లో హాంకాంగ్‌ వెళ్లినప్పుడు అక్కడ తెలుగు వారు ఎవరైనా ఉన్నారా? అని వెతికా. అలా 2005 నాటికి యాహూ గ్రూప్స్‌లో తెలుగువారందరూ కలిసేలా చేశా. 400 కుటుంబాల సభ్యులంతా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుంటాం. అక్కడున్న పిల్లలకు తెలుగు నేర్పించడం మా ముఖ్యోద్దేశం. అక్కడి పిల్లలు తెలుగు మాట్లాడగలరు.. రాయలేరు. వారికి ప్రతి శనివారం తెలుగు నేర్పిస్తున్నాం. జూమ్‌ సమావేశాల ద్వారా తెలుగు నేర్పించే ప్రయత్నం సాగుతోంది. ఈ క్రమంలో రేడియో ఆన్‌ ఇంటర్నెట్‌లో వ్యాఖ్యాతగా చేస్తున్నా. తెలుగు భాషలో పంచతంత్ర కథలు వంటి వాటిద్వారా తెలుగు భాష ప్రచారం చేస్తున్నాం.-జయ పీసపాటి, హాంకాంగ్‌

కథలతోనే తెలుగు వైభవం..
తెలుగు సాహిత్యం, తెలుగు భాష, తెలుగు వాడకం అద్భుతంగా జరగాలంటే ప్రతి పాఠశాలలో పిల్లలకు కథలు చెప్పాలి. చందమామ, బాలమిత్ర వంటి పుస్తకాల్లోని బొమ్మలు మనసులో భావాలు ఎలా వ్యక్తం చేయాలో నేర్పిస్తాయి. పిల్లలకు భాష పట్ల మక్కువ పెంచడం ద్వారా పదివేల సంవత్సరాలైనా తెలుగు భాష, సాహిత్యానికి ఢోకా ఉండదు. 26 అక్షరాల అతి నీరసమైన భాష వెంట పడి 56 అక్షరాలను దూరం చేసుకుంటున్నాం. ప్రపంచంలో అన్ని భాషల్ని, స్వరాల్ని స్వచ్ఛంగా పలికే భాష తెలుగు మాత్రమే. 25 ఏళ్ల తర్వాత ప్రపంచ భాషల్లో అత్యున్నతంగా మాట్లాడే భాష తెలుగవుతుంది. మన నిజమైన నిధి మన భాష. అది మన ముందు తరాలకు చేరాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలకు తెలుగు నేర్పాలి.-భువనచంద్ర, సినీ గేయరచయిత

ఇది సదస్సు విజయం
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు సాహితీ ప్రముఖుల ఉపన్యాసాలు, సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా సాహితీవేత్తలు, ఆధునిక యువ కవుల మధ్య అనుబంధం, సంధానం కలిగించడంలో సదస్సు జయప్రదమైంది. రచనలు చేయడంలో, అనేక పుస్తకాలు చదవడంలో, పుస్తక సమీక్షలు సాగించడంలో, సాహిత్య సమావేశాలు నిర్వహించడంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను వక్తలు విపులంగా తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సేవా రంగాలకు సంబంధించి సరికొత్త ఉత్తేజం కలిగించడం, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం ఈ సదస్సు సాధించిన విజయం.-జంధ్యాల శరత్‌బాబు, సాహితీవేత్త, శ్రీకాకుళం