News

ఘనంగా జ్ఞానాంబిక, సోమస్కందమూర్తి స్వామివార్ల కల్యాణోత్సవం

224views

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్కందరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో నిర్వహించే జ్ఞానాంబిక, సోమస్కందమూర్తిల కల్యాణోత్సవం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగే ఈ సంబరానికి పట్టణంలోని పెళ్లిమండపం ముస్తాబైంది. భక్తవత్సలుడైన వాయులింగేశ్వరుడు తన భక్తుల మధ్య వివాహం జరుపుకోవడం విశేషం. బ్రహ్మాది సమస్త దేవతలు, యక్ష, కిన్నెర, కింపురషాదులతో పాటు సప్తరుషులు..మునిశ్రేష్ఠులు అందరు దక్షిణ కైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తిలో అడుగిడటంతో పెళ్లివేడుకలకు సిద్ధమైంది. పెళ్లికుమారుడైన సోమస్కందమూర్తి గజవాహనాన్ని అధిరోహించారు. పెళ్లి కుమార్తె అయిన జ్ఞానాంబిక సింహవాహనంపై కొలువుదీరారు. వివాహ మధ్యవర్తి అయిన చండికేశ్వరస్వామి జ్ఞానాంబికతో పాటు వివాహ వేదిక వద్దకు చేరారు.