
పిల్లలకు పాఠాలు బోధిస్తూనే మరోవైపు పురాతన వస్తువులను సేకరిస్తూ తన ఇంటిని మ్యూజియంగా మార్చేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అనేక పురాతన వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరిచే వస్తువులు ఆయన ఇంట్లో దర్శనమిస్తాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ కలిగిన కొరుపోలు గంగాధర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. మానవ జీవన విధానంలో భాగమైన పురాతన వస్తువులను సేకరించడమే కాకుండా వాటి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ పని చేస్తున్నారు. ఈయన ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బాపడుపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 24 ఏళ్ల కిందట సరదాగా పాత వస్తువులు, నాణేలు, నోట్లు సేకరించడాన్ని మొదలుపెట్టి ఇప్పుడు దాన్నే ప్రవృత్తిగా మార్చుకున్నారు.


మన పూర్వీకులు నిత్యం ఉపయోగించే గృహోపకరణ వస్తువులలో అరుదైన కంచు, ఇత్తడి, రాగి వంటపాత్రలు, గిన్నెలు, పాన్ డబ్బాలు, కిరోసిన్, పెట్రోమాక్స్ లాంతర్లు, కర్ర గరెటెలు, నాటి కొలమానాలు సేరు, తవ్వ, సోల, మానికలు, గిద్దెలు తదితర వస్తువులను సేకరించారు. 1917 నాటి ఆవిరి భోజనం క్యారేజి, 80 ఏళ్ల నాటి ఫిల్టర్ కాఫీ సామగ్రి ఆయన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు 20 రకాల గ్రామ్‌ఫోన్లు, 1940 నాటి నుంచి విడుదలైన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాటలు, గాంధీ, నెహ్రూ ప్రసంగాల రికార్డులు వెయ్యికి పైగా ఉన్నాయి. 200 ఏళ్ల క్రితం నాటి చెక్క ఫ్యాన్, 19 శతాబ్దంలో కిరోసిన్‌తో తిరిగే ఫ్యాన్లు, 1932 నాటి రేడియోలు, టెలీఫోన్లు, టైపు మిషన్లు, తాళపత్రాలు, బ్రిటీష్ కాలంలోని ఉత్తరాలు, రాజముద్రలు, రంగం పెట్టెలను సేకరించారు. ‘నాడు మన పూర్వీకులు వాడిన వస్తువులన్నీ పర్యావరణ హితంగా ఉండేవి. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్, కెమికల్స్ వంటి హానికరమైన పదార్థాలతో తయారవుతున్నాయి. ఆ తేడాను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలనే లక్ష్యంతో వీటిని సేకరిస్తున్నాను’ అని చెబుతున్నారు గంగాధర్.






