
సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ ‘సముద్రయాన్’ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారని తెలిపారు. ‘‘సముద్రయాన్ కోసం ‘మత్య్స’ అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో ఆరు వేల మీటర్ల లోతులోకి ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని మంత్రి తెలిపారు.
సముద్రజలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లో కేంద్ర ప్రభుత్వం ‘సముద్రయాన్’ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. మత్స్య జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సర్లు, టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటలపాటు పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో దీని సామర్థ్యాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. సముద్రయాన్ విజయవంతంగా చేపట్టడం ద్వారా భారత్ ఆ దేశాల సరసన చేరనుంది.





