
పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు 1998 నాటి తీర్పును న్యాయస్థానం కొట్టేసింది.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకు వెళ్లారు.
దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా వారికి రక్షణ ఉంటుందా?అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపింది. దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
అనంతరం ఈ కేసును చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి నేడు కీలక తీర్పు వెలువరించింది. అవినీతికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది.
నాటి కేసులో ఏం జరిగింది..?
1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న శిబు సోరెన్ సహా ఇదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. సోరెన్ బృందానికి ఊరట లభించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.





