News

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

289views

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌ (సీఎస్‌డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు.


మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురితప్పకుండా కాల్పులు జరిపేవారిని ‘స్నైపర్‌’లుగా పేర్కొంటారు. 2021లో బీఎస్‌ఎఫ్‌లో చేరిన కుమారి.. పంజాబ్‌లో ఓ ప్లటూన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్‌ దాడుల ముప్పును గమనించారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 8వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం. ట్రైనింగ్‌లో ఎంతో ప్రతిభ కనబరిచారని.. కృషి, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. స్నైపర్‌ శిక్షకురాలిగా ఆమె అర్హత సాధించించారని ‘సీఎస్‌డబ్ల్యూటీ’ ఐజీ భాస్కర్‌ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్‌.