News

శ్వేతగిరి యాత్రకు వేళాయే

241views

శ్వేతగిరి యాత్రకు రంగం సిద్ధమైంది. భీష్మఏకాదశిని పురస్కరించుకుని.. ఈ నెల 20న గార మండలం శాలిహుండంలో వేణుగోపాలస్వామి యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. వంశధార నది పక్కన ఎత్తయిన కొండపై వేణుగోపాల స్వామి కొలువై పూజలందుకుంటున్నారు. ఏటా భీష్మ ఏకాదశి పర్వదినాన జాతర నిర్వహిస్తారు. స్వామి ఉత్సవమూర్తులకు వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు చేయిస్తారు. ఈ యాత్రకు వేలాది మంది భక్తులు తరలిరానుండడంతో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ మధురెడ్డి తెలిపారు. ఈ ఏడాది అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. కొండమీదకు చిన్న చిన్న వాహనాలు అనుమతించబోమన్నారు. సీఐ ఎల్‌.ఎస్‌.నాయుడు, గార ఎస్‌ఐ కె.కృష్ణ్రపసాద్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.