News

పునాది లేని దేవాలయం లేపాక్షి ఒక్కటే

381views

పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఉన్న పెయింటింగ్స్‌ (చిత్రలేఖనాల)ను భారతీయ శాస్త్రీయ పద్ధతుల్లో శుభ్రపరిచాలని ఇంటాక్‌ (అఖిల భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ ట్రస్టు) చైర్మన్‌ ఎల్‌కే.గుప్తా తెలిపారు. గురువారం సాయంత్రం లేపాక్షి ఆలయాన్ని ఇంటాక్‌ చైర్మన్‌తో పాటు అనంతపురం జిల్లా కన్వీనర్‌ రామ్‌కుమార్‌, కోకన్వీనర్‌ చంద్రహాసరెడ్డి, పూర్వ కన్వీనర్‌ ఏజీ వేణుగోపాల్‌, పురావస్తు, మ్యూజియం ఏడీ రజిత, ఇంటాక్‌ కెపాసిటి బిల్డర్‌ కృష్ణమూర్తి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఆలయంలో బ్రిటిష్‌ కాలం నాటి కాలంలో చిత్రీకరించిన చిత్ర లేఖనాలు కొంత వరకు మాసిపోయాయని, వాటిని ఇప్పుడు రసాయనిక పద్ధతుల్లో శుభ్రపరచడం వలన ప్రయోజనం లేదన్నారు. తమ ట్రస్ట్‌ ద్వారా ఒక చోట శాస్త్రీయ పద్ధతుల్లో పెయింటింగ్స్‌ వేసి చూపిస్తామని, ఆ పెయింటింగ్స్‌ బాగుంటే ప్రభుత్వం నిధులు సమకూరిస్తే ఆలయంలో ఉన్న పెయింటింగ్స్‌ పూర్తి చేస్తామన్నారు. దేశ చరిత్రలో పునాది లేని దేవాలయం లేపాక్షి ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ ఆలయం ఇప్పటి వరకూ యునెస్కో గుర్తింపుకు నోచుకోలేదన్నారు. లేపాక్షిని తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నా శాశ్వత గుర్తింపు కోసం ఎవరు ప్రయత్నించలేదని తెలిపారు. లేపాక్షిని యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.