News

అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత : పోలీసులు, కార్మికులపై ముస్లింల రాళ్ల దాడి

186views

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మునిసిపల్‌ కార్మికులపై స్థానిక ముస్లింలు రాళ్లు రువ్వడంతో 60 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీస్‌ స్టేషన్‌ను కూడా తగులబెట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు జారీ చేశారు.

అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు. అయినప్పటికీ అధికారులు బుల్డోజరుతో మదర్సాను కూల్చివేయించారు. దీంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ ఆక్రమణను తొలగించేందుకు పరిపాలన యంత్రాంగం వెళ్లిందని, ఆ సమయంలో కొందరు పోలీసులతో ఘర్షణకు దిగారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
‘‘పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. వెంటనే భద్రతా బలగాలను, ఇతర పోలీసులను అక్కడికి పంపించాం. శాంతియుతంగా ఉండాలని మేం ప్రతి ఒక్కర్ని అభ్యర్థిస్తున్నాం. కర్ఫ్యూను అమలు చేశాం. ఎవరైనా ఆందోళనలు చేసినా, ఘర్షణలకు దిగినా వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ధామి చెప్పారు.