News

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

312views

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌, మంచినీటి సరఫరా, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు వంటి అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.పోలీస్‌ శాఖ సమన్వయంతో ట్రాఫిక్‌ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని ఆలయ భద్రతా విభాగాన్ని ఆదేశించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తగిన నీటి నిల్వ లేనందున షవర్‌ స్నానానికి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. క్షేత్రంలోని ప్రధాన కూడళ్లలో తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.