
1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే ఉత్సాహంతో ఒకరి నొకరు తోసుకుంటూ వేదిక చుట్టుముట్టారు. కర్రలు విరగగొట్టి వేదిక పైకి ఎగబ్రాకారు. వేదిక కంపించసాగింది. ప్రమాదాన్ని ఊహించిన రక్షకులు గాంధీజీని వేదికపై నుండి జాగ్రత్తగా దింపేశారు. ఆ సమయంలో రక్షణ కవచంలా నిలబడి గాంధీజీని తన పైటకొంగు చాటున దాచి సభనుండి బయటకు తీసుకుని వచ్చింది ఒక మహిళారత్నం.
మరునాడు సభాస్థలి ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి. గాంధీజీ వేదికపై సహాయనిరాకరణ ఉద్యమ లక్ష్యాలు, అనుసరించవలసిన కార్యక్రమాలు వివరిస్తున్నారు. ఆ సభయందు నిన్న మహాత్ముని విపత్తు నుండి కాపాడిన యువతి ఇద్దరు వస్త్రములు ధరించి సభయందు కలయ తిరుగుతూ ప్రజలను క్రమశిక్షణగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది. గాంధీజీ తిలక్ స్వరాజ్యనిధికి చందాలు అభ్యర్థించగనే ఆమె తన మంగళసూత్రము మినహా తన వంటిపై ఉన్న రూ.3000 విలువ చేసే 200 కాసుల బంగారు ఆభరణాల్ని గాంధీజీకి ఆనందంగా సమర్పించి సభాసదుల్ని ఆశ్చర్యానందాల్లో ముంచివేసింది. గాంధీజీ “అమ్మా! నీవు తల్లితండ్రుల అనుమతి తీసుకున్నావా?” అని ప్రశ్నించారు. “నా తల్లితండ్రులు నా ఇష్టాన్ని ఎన్నడూ కాదనరు. నా ఆభరణములపై నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ మహత్తర కార్యానికి సహాయపడినందుకు సంతసిస్తారు కూడా!” అని అనర్గళంగా ఆంగ్లంలో వినయంతో సమాధానమిచ్చింది. అంతేకాక “మహాత్మా! మా మహిళల తరపున ఏలూరు విచ్చేయవలసినదిగా అభ్యర్థిస్తున్నాను” అని కోరింది. మహాత్ముడు ఆమె ఆహ్వానాన్ని మన్నించి ఏప్రియల్ 3న ఏలూరు సందర్శించారు.
గాంధీజీని ప్రప్రథమంగా జిల్లాకు రప్పించిన ఆ నారీమణియే మాగంటి అన్నపూర్ణదేవి. 1900, మార్చి 3వ తేదీన చాటపర్రు గ్రామంలో కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతుల ఏకైక సంతానంగా జన్మించారు. వీరు బ్రహ్మ సమాజ ప్రభావితులగుటచే స్త్రీ స్వేచ్ఛ, విద్యలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఏలూరు, గుంటూరులలో కొంతకాలం విద్యనభ్యసించిన అన్నపూర్ణను మంచి వాతావరణం అభిలషించి వారు కలకత్తా బ్రహ్మ బాలికా పాఠశాలకు పంపారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివించారు. తల్లితండ్రులు అంత సంపన్నులు కాకపోవటంత స్వతంత్రంగా సంపాదించాలనే కుశాగ్రబుద్దితో రచనా వ్యాసాంగాన్ని అన్నపూర్ణ ప్రారంభించింది. ‘సీతారాముల గాథ’ అనే చిన్నపిల్లల పుస్తకం 1916లో రచించి పండిత పామరుల ప్రశంసలను పొందారు. 1920లో విధుశేఖర శాస్త్రి రచించి ‘వివాహమంగళము’, సరళాదేవి గారి ‘నవవర్ష స్వప్నం’, అరవిందుని లేఖలు బెంగాలీ నుండి తెలుగులోకి అనువదించి ‘ఆంధ్ర ప్రచారిణి గ్రంథాలయము’ ద్వారా ప్రచురింప చేసిన దృఢదీక్షాపరురాలు.
1920లో మేనమామ మాగంటి బాపినీడుతో బ్రహ్మధర్మ సాంప్రదాయంలో వైభవంగా వివాహం జరిగింది. వివాహమంత్రాలన్నీ తెలుగులో బ్రాహ్మణేశన ప్రముఖుడు కానూరి వెంకట చలపతయ్య చౌదరి చదివారు. వివాహమైన కొద్దిరోజులకే బాపినీడు వ్యవసాయశాస్త్రం అభ్యసించేందుకు అమెరికా ప్రయాణమైనారు. సందర్భంలో భర్తను వినమ్రంగా ‘నన్ను మరచినా, దేశమును మాత్రం మరువబోకండి’ అని హెచ్చరించి పంపిన సుగుణశీలి అన్నపూర్ణ. తాను కూడా అమెరికా వెళ్ళుటకై విలువైన విదేశీ వస్త్రములను కొని, ఓడ టిక్కెట్టును కూడా రిజర్వు చేసుకున్నది అట్టి సమయంలో గాంధీజీ అసహాయ దుందుభిని మ్రోగించి, స్వరాజ్య మహార శంఖారావం పూరించారు. గాంధీజీ విజయవాడ రాకతో అన్నపూర్ణాదేవి జాతీయ సమరాహ్వానాన్ని అందుకొని, తన విదేశీ వస్త్రాలను అగ్నికి ఆహుతి ధరించి, తన సమస్త ఆభరణములను దేశసేవకై గాంధీజీకి సమర్పించినది. అమెరికా ప్రయాణాన్ని విరమించుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్యోద్యములను ప్రవేశించిన ప్రథమ మహిళయై, సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రబోధిస్తూ ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. భీమవరం, పెదఅమిరం, పెంటపాడులలో ఆమె ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావం యువతలో దేశ భక్తిని రగుల్కొల్పింది. ఆమె ఉపన్యాసాలు ప్రజలపై ప్రగాఢ ప్రభావాన్ని చూపాయి. ప్రజలనుండి విరాళాలు వసూలు చేసి ఏలూరునందు 1923లో మోహన్ దాస్ ఖాదీ పరిశ్రమాలయాన్ని స్థాపించింది. విదేశీ వస్తు దుకాణాల వద్ద, కల్లు అంగడుల వద్ద పికెటింగు చేసి పురుషులలో దేశభక్తిని పురిగొల్పారు. హరిజన బాలిక రామానుజమ్మను, మరి ఒక బాలుని ఇంటిలో ఉంచుకొని సొంత పిల్లలవలె వారి పోషణభారం వహించారు. ఈ చర్య వలన సంఘ బహిష్కరణకు గురియైనా చలించని ధీమంతురాలు.
భర్త వీలయినంత త్వరగా స్వదేశానికి వచ్చి తనతో కలసి ఉండి దేశసేవ చేస్తూ జాతి, కుల, మత ప్రసక్తికి అతీతమైన నాయకునిగా కీర్తి పొందాలన్నదే తన తపన అని పదే పదే లేఖల ద్వారా తెలియపర్చింది. 1923లో బాపినీడు స్వదేశానికి తిరిగిరాగా ఓడ వద్దకు తాను స్వయంగా ఖద్దరు దుస్తులు తీసుకొని వెళ్ళి విదేశీ సూటు, బూటు, హేటులను సముద్రంలో పారవేయించి, ఆయనకు స్వదేశీ దీక్షను ఇచ్చి రాజకీయ మార్గదర్శియైనది. అన్నపూర్ణకు అన్నీ ఉన్నా అనారోగ్యం వెంటాడింది. 1924లో మగ శిశువు జన్మించి విగతుడైనాడు. అనారోగ్యం ఆమెను క్రుంగదీసింది. విజయవాడ, పక్షితీర్థంలలో వైద్యం చేయించారు. ఆ కాలంలోనే అన్నపూర్ణ ‘నారి’ అనే స్వంత రచన చేసింది.
శ్రీరామకృష్ణ పరమహంస ‘లీలామృతము’ అనే బెంగాలీ గ్రంథాన్ని ఆంధ్రీకరించింది. 1927 మార్చి 1న ఆమెకు ఏకైక సంతానమగు ఝాన్సీలక్ష్మికి జన్మనిచ్చి అక్టోబరు 9న దైవసాన్నిధ్యం చేరింది.
27 సంవత్సరాల చిన్న ప్రాయంలో మరణించిన అన్నపూర్ణదేవికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గాంధీజీ “నాకు జ్ఞాపకమున్నంతవరకు తనకున్న బంగారు నగలన్నింటినీ దేశం కోసం సమర్పించిన ప్రథమ భారత మహిళ అన్నపూర్ణ. దేశంలో నా అదృష్టం కొద్దీ అనేక మంది పుత్రికలు నన్ను తండ్రిగా స్వీకరించారు. అలాంటి పుత్రికలలో ఒకరైన అన్నపూర్ణ అత్యుత్తమురాలు. ఆమె మరణంతో భక్తురాలినే కాదు, పుత్రికను కోల్పోయినట్లు భావిస్తున్నాను” అని అశ్రునయనాలతో అన్నారు. గాంధీజీ దేశంలో ఎచ్చట స్త్రీల సమావేశంలో మాట్లాడిన అన్నపూర్ణాదేవి ప్రశంస లేకుండా మాట్లాడలేదు. దేశభక్తితో జీవితాన్ని పునీతం చేసుకుని మహిళాలోకానికి మణి కిరీటమై నిలిచిన అన్నపూర్ణదేవికి ఆంధ్రులందరూ అంజలి ఘటించారు.





