
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుశిక్షకు గురైన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఆమెను జైల్లో ఎక్కడ, ఎలా ఉంచాలి? అది జిల్లా కలెక్టర్ కి కూడా పెద్ద ప్రశ్న. అందుకే, ఆయనే సుబ్బమ్మని సమీపించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే వదిలేస్తానన్నాడు. తన కాలిగోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ అడగదు అంది ఆమె. ఒక వందరూపాయల ఫైన్ కడితే వదిలేస్తాను అన్నాడు. తన తలమీద కప్పుకున్న చీరచెంగు తీసి, నా దగ్గరేముంది, విధవని బోడిగుండు తప్ప అంటూ పకపకా నవ్వింది. కలెక్టర్ కి ఏం చేయాలో అర్థంకాలేదు. కఠిన కారాగార శిక్ష విధించాడు. ఆనందంగా జైలుకెళ్లింది. అదీ దువ్వూరి సుబ్బమ్మ అంటే.
తూర్పు గోదావరి జిల్లాలోని దాక్షారామం ఆమె జన్మస్థలం. 1881వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన సుబ్బమ్మ జన్మించింది. వారి తండ్రి మల్లాది సుబ్బావధాని. పదేళ్ల వయసులోనే సుబ్బమ్మకు వివాహం జరిగింది. ఆమె భర్త దువ్వూరి వెంకటప్పయ్య. అనేక బాల్యవివాహాలలో జరిగినట్లే, సుబ్బమ్మ జీవితంలోనూ విషాదమే నిండింది. ఆమె భర్త వెంకటప్పయ్య మరణించారు. బాల్యంలోనే ఆమె వైధవ్య దుఃఖానికి గురైపోయింది. అయితే ఆమె నిరుత్సాహ పడలేదు. చల్లపల్లి వెంకటశాస్త్రి దగ్గర తెలుగు, సంస్కృతం చదువుకొంది. కృషితో, పట్టుదలతో రెండు భాషల్లో మంచి పాండిత్యం సంపాదించింది. తనపాండిత్యంతో అద్భుతమైనరీతిలో ఉపన్యసించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ దుర్మార్గాలను నిర్భయంగా ఎండగట్టింది.
సుబ్బమ్మ గొప్పవక్త. అనర్గళంగా మాట్లాడేది. ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలను, సంస్కృత శ్లోకాలను అలవోకగా చదువుతూ ప్రసంగించేది. చిలకమర్తి వారి పద్యాల్నీ, గరిమెళ్ళ వారి పాటల్నీ రాగయుక్తంగా పాడుతూ, ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది. ఆమె ఉపన్యాసాలను ప్రజలకు వినబడనివ్వకూడదని, ఆమె మాట్లాడే చోట డప్పులు వాయించేవారట. అయినా ఆవిడ తన ఉపన్యాసం ఆపేవారే కాదు. డప్పు కొట్టికొట్టీ వాళ్లు అలసిపోయి వెళ్ళిపోయాక, ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించేవారు. 1921లో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో, స్వాతంత్ర తీర్మానాన్ని సమర్ధిస్తూ ఆమె చేసిన అద్భుతమైన ప్రసంగం అశేష జనవాహినిని ఉత్తేజపరిచింది.
సంఘసంస్కరణ మార్గంలో సాగిన ఉత్తమ మహిళ ఆమె. పెద్దాడ సుబ్బమ్మ, చల్లపల్లి సీతమ్మల సహకారంతో మహిళా సభలు ఏర్పాటు చేశారు ఆమె. బాలికా పాఠశాల స్థాపించి, బాలికలకు ఉచితభోజనవసతి కల్పించారు. ఆమె రూపం ఎంతో నిరాడంబరం. మరెంతో గౌరవనీయం. తలమీద ఖాదీ చీరముసుగు వేసుకొనేవారు. చిన్నప్పుడే పోలియో రావడం వల్ల, చేతికర్ర సాయంతో కుంటుతూ నడిచేవారు. నెత్తిన ఖాదీ బట్టల మూట, భుజానికి ఖాదీ సంచి.. అలాగే ఊరూరా ఖద్దరు బట్టలు అమ్ముతూ తిరిగేవారు. స్వరాజ్య పోరాటంలో 1920లో మొదటిసారిగా ఏప్రెల్ 4వ తేదీ నుండి ఒక సంవత్సరం రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. ఆ తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 31-3-1930 నుండి రాయవేలూరు జైలులో నిర్బంధించబడ్డారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు.
ఆంగ్లేయ పోలీసులు స్వాతంత్ర వీరులను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిని రహస్యంగా వంట ఇంటిలోని పొగగూళ్లలో చాకచక్యముగా దాచేవారు. పైగా కాంగ్రెస రహస్య దళములో చేరి, ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారి చర్యలను నాయకులకు తెలియజెప్పేవారు. ఎటువంటి పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం ఆమెది ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థురాలు ఆమె. ఆ రోజుల్లో పిఠాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మని పోలీసులు తీవ్రంగా కొట్టేరు. ఆ దారుణాన్ని చూసి చలించిపోయి.. పోలీసుల లాఠీలకి ఎదురు నిలిచింది. “మీరు, మనుషులా, రాక్షసులా?” అని పోలీసుల్ని నిలదీసింది. జీవితమంతా దేశసేవలోనే గడిపిన సుబ్బమ్మగారు ఎటువంటి పదవుల ఆశించలేదు. ఎటువంటి గౌరవాలూ కోరుకోలేదు. దాదాపుగా 16 ఏళ్లు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా, స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమయ్యారు. స్వాతంత్య్ర వచ్చినప్పుడు “స్వేచ్ఛను పొందండి. ఆనందాన్ని అనుభవించండి. ఈ శుభవేళలో తీపి తినండి” అంటూ అందరికి మిఠాయిలు పంచిపెట్టింది. ఆమె చేసిన దేశసేవన దృష్టిలో ఉంచుకొని కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను ‘దేశబాంధవి’ ప్రస్తుతించింది. 1964 మే నెల 31వ తేదీన పరమపదించారు దువ్వూరి సుబ్బమ్మ.




