
హిమాలయాల్లోని హిందూకుష్ పర్వత శ్రేణి గడచిన వందేళ్లలో 70 శాతం జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అక్కడ ప్రకృతి పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు తక్షణం నిధులు కేటాయించి కార్యాచరణకు దిగాలని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థకు చెందిన పరిశోధకులు సోమవారం పిలుపు ఇచ్చారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో జీవవైవిధ్యం, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రభుత్వ సైన్స్-పాలిసీ వేదిక (ఐపీబీఈఎస్) నేపాల్ రాజధాని కాఠ్మాండూలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వరకు జరిగే ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన 130 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.
దక్షిణాసియాలో తొలిసారి సమావేశమవుతున్న ఐపీబీఈఎస్ 2012లో ఏర్పడింది. అందులో 145 దేశాలకు సభ్యత్వం ఉంది. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్ దేశాలలో 3,500 కిలోమీటర్ల దూరం హిందూకుష్-హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 24.1 కోట్ల మందిలో 31% మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి జీవవైవిధ్య రక్షణకు ఇప్పటికే ఆలస్యమైపోయిందని శాస్త్రవేత్త ఇజబెలా కోజియెల్ కాఠ్మాండూ సమావేశానికి తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల హిందూకుష్ ప్రజల నీరు, ఆహార, ఆరోగ్యావసరాలపై ప్రభావం పడుతోంది. ఈ దుస్థితికి జీవవైవిధ్య క్షయానికి మధ్య ఉన్న లంకెను మరింత లోతుగా అర్థం చేసుకుని పరిష్కారాలను ప్రతిపాదించడానికి ఐపీబీఈఎస్ సమావేశం దృష్టి కేంద్రీకరించింది. హిందూకుష్‌లో ప్రకృతి క్షీణత.. జంతు, వృక్ష, మానవజాతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఐపీబీఈఎస్ అధ్యయనకర్త సునీతా చౌధరి తెలిపారు.





