ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 6 ; అన్నాప్రగడ కామేశ్వరరావు

521views

అన్నాప్రగడ కామేశ్వరరావు స్వగ్రామం. అప్పటి మద్రాసు ప్రావిన్స్ లోని, ఇప్పటి గుంటూరు జిల్లా ‘నాదెండ్ల గ్రామం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరి, యుద్ధ విద్యలు నేర్చుకొని, ఆ తరువాత భారతీయ యువతీ యువకులకు సైనికశిక్షణ ఇచ్చి, వారిని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటయోధులుగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరిన అన్నాప్రగడ కామేశ్వరరావు ముందుగా జబల్పూర్, కంటీనగర్ లలో సైనిక శిక్షణ పొందారు. శిక్షణ కాలంలో ఆయన నైపుణ్యం, చలాకీతనం, రైఫిల్ షూటింగ్లో అసమాన ప్రతిభ గమనించిన బ్రిటిష్ సైనికాధికారులు ఆయనను కేవలం రెండు సంవత్సరాలకే సైనికాధికారిని చేశారు. అంతేకాకుండా అతని సారథ్యంలో ఒక సైనిక పటాలాన్ని బాగ్దాద్ – బస్రాల మధ్య గల ‘కూటమారు’ ప్రాంతానికి తరలించారు. అక్కడ ఉన్న బద్దూ కొండజాతి విప్లవకారులు బ్రిటిష్ సైన్యంపై తరచుగా గెరిల్లా దాడులు చేసి, బ్రిటిష్ అధికారులను చంపుతుంటే ఆ బద్దూ గెరిల్లాలను తుదముట్టించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆ సైనిక దళాన్ని అక్కడకు పంపించింది.

బ్రిటిష్ ఇండియా సైన్యం అక్కడకు చేరికొని కూటమారు ప్రాంతంలో గుడారాలు వేసికొని సేదదీరుతున్న సమావేశంలో బద్దూ గెరిల్లాలు ఆ సైనిక గుడారాలమీద ఆకస్మిక దాడి జరిపారు. బ్రిటిష్ అధికారులను, సైనికులనూ చంపివేసి, భారతీయ సిపాయిలను, అధికారి హోదాలో ఉన్న అన్నాప్రగడ కామేశ్వరరావును మందలించి విడిచిపెట్టారు.

బద్దూ గెరిల్లాలకు నాయకత్వం వహించిన ఒక బద్దూ జాతి కన్య అప్పుడు “బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని బానిసలను చేసి పరిపాలిస్తున్నది. మీ భారతీయులు కూడా బ్రిటిష్ వాడికి బానిసలే. ఇకనైనా తెలివి తెచ్చుకొని మీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడండి. మిలిటరీని విడిచి పెట్టి భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొనండి” అని చేసిన హెచ్చరిక ప్రకారం అన్నాప్రగడ కామేశ్వరరావు కొద్ది రోజులు అలాగే సైన్యంలో కొనసాగుతూ మాత్యూస్, మెండిమియా, మరికొందరు దేశభక్తులైన సిపాయిల సహకారంతో బ్రిటిష్ ఇండియా సైన్యంలో సైనిక తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నించాడు.

సైనిక తిరుగుబాటు విషయం గ్రహించిన సైనికాధికారులు అన్నాప్రగడ కామేశ్వరరావును బంధించి, ఆయనపై కోర్టుమార్షల్ విధించి, ఆయనకు మరణదండన శిక్ష విధించారు. కానీ, ఒక్క ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచ బ్రిటిష్ వలస దేశాల్లో కూడా అన్నాప్రగడకు ప్రభుత్వం విధించిన మరణ దండనను రద్దుచేయాలని వచ్చిన ఒత్తిడి క్రమంగా ఉద్యమ రూపం దాల్చిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తెలివిగా, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించిన సంతోష వార్తను కారణంగా చూపించి అన్నాప్రగడకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. చాలా రోజులు బస్రా జైలులో గడిపిన ఆయన అప్పుడు విడుదలై, ‘ఎలిఫెంటా’ నౌకలో ప్రయాణం చేసి కరాచీ చేరాడు. అక్కడ ఆయన తన సైనిక దుస్తులు – కాల్చివేసి ఖద్దరు వస్త్రాలు ధరించాడు. సుదీర్ఘ ప్రయాణం చేసి తన స్వగ్రామమైన నాదెండ్ల చేరాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజులు అవి.ముందుగా తన తండ్రి రోశయ్య గారిచేత ఆయన కరిణీకం ఉద్యోగానికి రాజీనామా ఇప్పించాడు అన్నాప్రగడ. వివిధ గ్రామాల్లో పర్యటించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరూ పన్నులు కట్టకుండా కట్టడి చేశాడు. అన్నాప్రగడకు ఒక సంవత్సరం కారాగారవాసం శిక్ష విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు, కడలూర్ జైలుకు తరలించబడ్డారు.

అన్నాప్రగడ బొంబాయి వెళ్లి అక్కడ సావర్కర్ సోదరులను కలిసి, ఎలాగైనా తను రష్యా దేశానికి వెళ్లాలని, కుతుబ్ యూనివర్సిటీలో యుద్ధ విద్యలు నేర్చుకోవాలనీ ఉన్న తన కోరికను ఆయన సావర్కర్ సోదరుల ముందు వెలిబుచ్చాడు. వారి సూచనల మేరకు వెంటనే ‘బరోడా’ వెళ్లి, అక్కడ ‘జుమ్మా దాదా’ను కలిశాడు. అన్నాప్రగడ. జుమ్మాదాదా గొప్ప దేశభక్తుడు. అఖాడాలు నిర్వహిస్తూ బరోడాలో రహస్యంగా విప్లవవీరులను తయారు చేస్తున్నాడు. ఆయన అభ్యర్థనపై అన్నాప్రగడ నానాసాహెబ్‌కు చెందిన ‘బిఠూరు’ గ్రామానికి వెళ్లి, అక్కడ ‘హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ ‘వారికి సైనిక శిక్షణ ఇచ్చాడు. శిక్షణ పొందిన వారిలో చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్, బటుకేశ్వరదత్, ఉన్నారు. అక్కడ శిక్షణఇచ్చిన తరువాత తిరిగి బరోడా చేరాడు అన్నాప్రగడ. బరోడా ఆర్యకుమార ఆశ్రమంలో ఆయన బస. అదే ఆశ్రమంలో ఉన్న సరళాదేవి’తో ఆయన వివాహం పలువురు విప్లవకారుల సమక్షంలో జరిగింది. లాలా లజపత్ రాయ్ గార్ని లాఠీలతో కొట్టి చంపిన సాండర్స్‌ను చంపేందుకు భగత్ సింగ్ బృందం అన్నాప్రగడ సహకారం తీసుకున్నారు. ఆ కారణం బ్రిటిష్ పోలీసులు అన్నాప్రగడను అరెస్టు చేయడానికి ఆర్యకుమార ఆశ్రమానికి రాగా, బరోడా మహారాజు శాయోజీరావు గైక్వాడ్ ఆయనను తప్పించి సరళాదేవితోసహా తిరిగి ఆంధ్ర దేశానికి పంపించాడు. మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం దగ్గర అజ్ఞాతవాసం గడిపారు.

1947లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు – తెనాలి నియోజకవర్గం నుంచి మదరాసు శాసనసభ్యులుగా ఎన్నుకోబడి మదరాసు అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అసెంబ్లీలో అనేక ప్రజా సమస్యలపై గళం విప్పాడు. గుంటూరు పట్టణానికి భూగర్భ డ్రెయినేజీ, రైలుమార్గంపై రోడ్డు మార్గం (ఓవర్ బ్రిడ్జి) సాధించాడు. రెవెన్యూ శాఖ నుంచి కార్మికశాఖను వేరుపరచడంలో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీలో ఉన్న కొందరు మంత్రులు, శాసనసభ్యులు చేసిన అవినీతిపై పోరాటం చేసిన అన్నాప్రగడ, అది చాలదన్నట్లు ‘అంకుశం’ పేరుతో ఒక వారపత్రిక ప్రారంభించి, తన రచనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించాడు.

ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె, అఖిల భారత స్వాతంత్ర్య సమరయోధుల సభ ‘ఏర్పాటు చేసి, డెహ్రాడూన్లో సభ జరిపించి, ఆ సంస్థకు అన్నాప్రగడను అధ్యక్షుడుగా చేశారు. స్వాతంత్య్ర్య సమరయోధులకు పెన్షన్లు ఉచిత ప్రయాణ సౌకర్యం, స్థలాలు ఇవ్వడం మొదలైంది అన్నాప్రగడ చొరవతోనే. 1987 జనవరి 30 నాడు పూనా నగరంలో కాలధర్మం చెందాడు.