
ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఎనీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బరంపార్క్ నుంచి ఏర్పాటు చేసిన బస్సులో తీసుకువెళ్లి దర్శనం చేయించి తిరిగి తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి బయలుదేరే బస్సు పరిసరాల్లోని ఆలయాలను దర్శింపచేసి ఒక్క రోజులోనే ముగుస్తుంది. విజయవాడ నుంచి బయలుదేరి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకునేందుకు రెండు రోజుల ప్యాకేజీని రూపొందించారు. ఆయా ప్యాకేజీల్లో భాగంగానే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మాత్రం దర్శనంతోపాటు వసతి సౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. భవానీపురంలోని పున్నమి హోటల్ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం చేసిన తరువాత బయలుదేరే ఏపీటీడీసీ బస్సు ద్వారా అమరావతిలోని శ్రీఅమరేశ్వర స్వామి ఆలయం, మంగళగిరిలోని పానకాల స్వామి గుడి, బాపట్ల సూర్యలంకలోని బీచ్ చూపించిన అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయం, పొన్నూరులోని శ్రీవీరాంజనేయ స్వామి ఆలయం సందర్శన చేయించి రాత్రి 8 గంటలకు తీసుకొస్తారు. ఇందుకుగాను పెద్దలకు రూ.1020, పిల్లలకు రూ.979 గా నిర్ణయించారు.
విజయవాడ నుంచి శ్రీశైలం
విజయవాడ నుంచి (భవానీపురంలోని పున్నమి హోటల్) శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకున్న తరువాత బస్సు బయలుదేరి తొలుత శ్రీత్రికోటేశ్వర స్వామి (కోటప్పకొండ), అక్కడ స్వామివారి దర్శనానంతరం త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరి దేవి గుడికి తీసుకువెళతారు. ఆ రోజు రాత్రి అక్కడే ఏర్పాటు చేసిన వసతి గృహంలో విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయం బయలుదేరి శ్రీశైలానికి చేరుకుని శ్రీబ్రమరాంభ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తరువాత పాతాళ గంగ, సాక్షి గణపతి, పాలధార.. పంచధార ప్రదేశాలను చూపిస్తారు. తిరిగి విజయవాడకు చేరుకుంటారు. ఇందుకుగాను పెద్దలకు రూ.3245, పిల్ల లకు రూ.2610 చార్జిగా నిర్ణయించారు. బస్ టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌బుక్‌మైదర్శన్ వెబ్సైటులో బుక్ చేసుకోవచ్చు. 9550842200, 040-49575757, 9848007025 నెంబర్లలో సంప్రదించవచ్చు.





