
( జనవరి 26 – రాణి గైడెన్లు జయంతి )
భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష, జాతి, మత బేధాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య భారతం నుండి ఒక వనవాసి మహిళా నాయకురాలు పాల్గొన్నారు. వారే రాణి గైడెన్లు. రోంగ్మీ నాగా తెగకు చెందిన గైడెన్లు 1915 జనవరి 26న ప్రస్తుత మణిపూర్ రాష్ట్రంలోని టామెంగాంగ్ జిల్లాలోని నుంగ్కావ్‌లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కరోటియెన్లియు, లోథోనాంగ్‌లు. పెద్దగా చదువుకోలేదు. అయితే ప్రజల బాధల గురించి తెలుసుకున్నారు. వారి జాతి పరిరక్షణ కోసం కృషి చేయాలని కలలుగన్నారు. నాగ జాతి నాయకుడు, గురువు హైసావు జుడోనాంగో బోధనలతో ప్రభావితురాలైన హెరాకా మత ఉద్యమంలో పాలుపంచుకున్నారు. నాగజాతి పునరుజ్జీవనం, బ్రిటీష్ పరిపాలనను అంతం చేసి నాగా జాతి వారి పాలనను తీసుకుని రావడమే ఈ ఉద్యమం ధ్యేయం. 1931 ఆగస్ట్ నెలలో జుడోనాంగ్ మరణించడంతో ఆయన వారసురాలిగా రాణి గైడెన్లు బాధ్యతలను స్వీకరించారు.
గైడెన్లు గెరిల్లా దళ నాయకురాలయ్యారు. స్వతంత్ర సాయుధ బలగాలను నిర్మించి వనవాసీ, వనవాసీయేతర గ్రామాలపై తెల్లదొరల విధ్వంసాన్ని ధైర్యసాహసాలతో ఎదిరించి పోరాడింది. ముఖ్య నాగా తెగలైన జెమీ, ల్యాగ్ మేయీ, రాంగ్ మేయీలను హరాకా ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ఓ వైపు బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తూనే మరోవైపు సాంప్రదాయక నాగా జాతి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలని తన అనుచరులకు గైడెన్లు బోధించారు. వారిని జాగృతి పరిచారు. బ్రిటీష్ వారికి పన్నులు కట్టవద్దని హితబోధ చేయడంతో గెడెన్లును ఇలా వదిలేస్తే చాలా ప్రమాదమని, తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని వారికి అర్థమయింది. దీంతో బ్రిటీషువాళ్లు గైడెన్లుపై దండయాత్ర నడిపించారు. ఆమెను పట్టి తమకు అప్పగిస్తే 10 సంవత్సరాల పాటు ఆ ఊరికి పన్ను రద్దు చేస్తామని ఆశ చూపించారు. చివరకు ఒక దేశద్రోహి, జాతి ద్రోహి గైడెన్లు ఆచూకీని అందించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
గైడెన్లు యవ్వన జీవితం అంతా 14 ఏళ్ల పాటు చెరసాలలోనే గడిచింది. గౌహతి, షిల్లాంగ్, ఐజ్వాల్, తురా జైళ్లల్లో శిక్షను అనుభవించారు. సుదీర్ఘ కాలం జీవిత ఖైదీగా జైలు శిక్షను అనుభవించిన తొలి మరియు ఏకైక భారతీయ మహిళ మన గైడెన్లు. వివిధ జైళ్లల్లో 14 ఏళ్లు మగ్గిన తర్వాత స్వాతంత్ర్యానంతరం 1947లో గైడెన్లు విడుదల అయ్యారు. కానీ మణిపూర్‌లో ఆమె ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో నాగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటం చేపట్టారు. 1960 నుంచి అజ్ఞాతంలోనే ఉన్న గైడెన్లు 1966 నుంచి బహిరంగంగా నాగాలాండ్‌లో శాంతిస్థాపనకు కృషి చేశారు. నాగాలను భారతజాతి ప్రధాన స్రవంతిలో కలపడానికి గైడెన్లు చేసిన సేవకు గాను 1972లో భారత ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. 1981లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మరణానంతరం బిర్సాముండ పురస్కారం గైడెన్లును వరించింది.
గైడెన్లు 1993 ఫిబ్రవరి 17న లాంగ్కాప్ గ్రామంలో మరణించారు. మణిపూర్, నాగాలాండ్ ప్రభుత్వాల అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 1996 సెప్టెంబర్ 12న 1 రూపాయి విలువతో గైడెన్లు స్టాంపును భారత తపాలా శాఖ విడుదల చేసింది. మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వనవాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త వనవాసీ ఉద్యమాల వెనుక రాణీమా గైడెన్లు కృషి ఉంది. స్వాతంత్ర్యోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియ పుత్రికగా రాణి గైడెన్లు పేరు భారత చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.





