News

అయోధ్యకు వెళ్లి తీరతా : హర్భజన్‌ సింగ్‌

653views

తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.

ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు.

కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్‌ను బాయ్‌కాట్‌ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆమ్‌) చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్‌ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు.

ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్‌ చెప్పడం కొసమెరుపు.

అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి

ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం.

నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్‌ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్‌ నుంచి ఆప్‌ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.