
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని ఈనెల 21న ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం అమ్మవారి తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి మోదకొండమ్మకు కేజీ బంగారంతో తయారుచేసిన కిరీటాన్ని అలంకరించనున్నారు. అమ్మవారికి వచ్చిన బంగారు ఆభరణాలను పోగుచేసి ఆలయ కమిటీ ప్రత్యేక చొరవతో ఈ కిరీటాన్ని చేయించారు. గత నెలలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అమ్మవారికి అర కేజీ బంగారు హారాన్ని బహూకరించారు.
తీర్థంలో భాగంగా ఆదివారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, సాయంత్రం ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ ఛైర్‌పర్సన్ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సింహాచలంనాయుడు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కానుండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.





