
రామమందిరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతోమంది యువత అయోధ్యకు సాహసయాత్రలు చేస్తున్నారు. నడకతో కొందరు.. సైక్లింగు, స్కేటింగు వంటి భిన్న మార్గాల్లో మరికొందరు అయోధ్యకు చేరుకొంటున్నారు. గజగజా వణికించే చలిలో రాముడిపై అచంచల భక్తితో ముందడుగు వేసి ఏకతా సందేశం ఇస్తున్నారు. బిహార్‌కు చెందిన నీతీశ్ కుమార్ అనే యువకుడు 615 కి.మీ.లు సైకిలు తొక్కి శుక్రవారం రామ జన్మభూమిపై కాలుమోపాడు. వారణాసికి చెందిన సోనీ చౌరాసియా 228 కి.మీ.లు స్కేటింగు చేస్తూ 17న అయోధ్యకు పయనమైంది. 124 గంటల మారథాన్ నృత్యంతో గిన్నిస్ రికార్డు విజేత అయిన సోనీకి ట్రస్టు నుంచి ఇదివరకే ఆహ్వానం లభించడం విశేషం. రాజస్థాన్‌లోని కోట్‌పూతలీకి చెందిన పదేళ్ల హిమాన్షు సోనీ సైతం 704 కి.మీ.ల స్కేటింగు లక్ష్యంతో ఈ నెల 16న అయోధ్యకు బయలుదేరింది.

ముంబయి నుంచి 1,400 కి.మీ.ల కాలినడకతో షబ్నం..
ముంబయి నుంచి షబ్నం షేక్ అనే యువతి అయోధ్యకు 1,400 కి.మీ.ల పాదయాత్ర చేపట్టింది. రాముడి జెండా చేతబట్టి రోజుకు 60 కిలోమీటర్లు ఈమె నడుస్తోంది.
కర్ణాటకకు చెందిన ముత్నా తిర్లపుర గాంధీ వేషధారణతో 2 వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యలో అడుగుపెట్టాడు. బుడ్డా అంకుల్‌గా ప్రచారం పొందిన ఒమేశ్ భగత్ (47) పర్యావరణ పరిరక్షిణ సందేశంతో అయోధ్య యాత్ర చేపట్టారు. సైకిలు వెనక సీటుకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని గతేడాది మే నుంచి 13 వేల కిలోమీటర్లకు పైగా సైకిలుపై దేశవ్యాప్తంగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఖార్సియాకు చెందిన 36 ఏళ్ల రైతు నరేశ్‌గుప్తా పాదరక్షలు ధరించకుండా 700 కి.మీ.లు నడిచి రెండు నెలల అనంతరం అయోధ్యకు చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన జస్విందర్ సింగ్ లక్కీ, అతడి కుమారుడు.. పంజాబ్‌లోని బటాలా నుంచి నితిన్ భాటియా అయోధ్యకు సైకిళ్లపై బయలుదేరారు.





