
భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు కన్నెగంటి హనుమంతు
సహాయ నిరాకరణోద్యమం ఉదృతంగా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండుమీద కారం చల్లినట్లు, అటవీ చట్టాలకు సవరణ చట్టాలను తెచ్చింది. ఆ కొత్త చట్టాలను చాలా కఠినంగా అమలు చేయసాగింది. సవరించిన ఈ కొత్త అటవీ చట్టాల ప్రకారం, పశువుల మేతకోసం గానీ, అటవీ సంపదతో జీవనం సాగించేందుకు గానీ అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొత్త చట్టం ప్రకారం అడవుల్లో ప్రవేశానికి, సంపద సేకరణకు, పశుగ్రాసం కోసమూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పుల్లరి పన్ను అధికం చేశారు. అసలే పేదరికంతో మగ్గుతున్న పల్నాడు ప్రజలు ఈ సవరించిన కొత్త అటవీ చట్టాలను ధిక్కరించటం ప్రారంభించారు. ఈ పుల్లరి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారే కన్నెగంటి హనుమంతరావు, జనం ఆయన్ను ఆప్యాయంగా హనుమంతు అని పిలిచేవారు. కన్నెగంటి హనుమంతు చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చినవాడు. దానధర్మాలకు వెనుకాడకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను స్వయంగా రంగంలోకి దిగి వారి ఇబ్బందులను తీర్చేవాడు. అలా పల్నాడు ప్రాంతంలో అధికంగా ప్రజాభిమానాన్ని పొందిన వారు కన్నెగంటి హనుమంతు.
1922 జనవరి 7న, గాంధీజీ కొన్ని ప్రాంతాల్లో పన్నుల, సహాయ నిరాకరణ ఉద్యమాలు చేయవచ్చని అనగానే ఆంధ్ర కాంగ్రెసు బెజవాడలో సమావేశమైంది. గుంటూరు, కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉద్యమం ఉధృతంగా సాగగా గ్రామాధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నాయకులు గ్రామాల్లో తిరిగి ప్రజలను పన్నుల నిరాకరణకై సమాయత్తం చేశారు.
అలాంటి పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వం కొత్త అటవీ చట్టాలను తెచ్చింది. అటవీ సంపదమీద ఆధారపడి జీవిస్తున్న వారు, పశువుల గ్రాసం కోసం వాటిని అడవులకు తోలేవారు. గతంలో కంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం అధికమొత్తంలో పుల్లరి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా కన్నెగంటి హనుమంతు పల్నాడు లోని వివిధ గ్రామాల్లో తిరిగి పన్నులు చెల్లించకుండా ప్రజలను కట్టడి చేశాడు. సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిని సాకుగా చూపించి ప్రభుత్వం జనంమీద విరుచుకు పడింది.
1921 ఫిబ్రవరి 16 నాడు ముఖ్యంగా పలనాడు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ”మించాలపాడు’ గ్రామంలో తీవ్రమైన సంఘర్షణ జరిగింది, కోలగుట్ల గ్రామానికి శివారు గ్రామమే మించాలపాడు. అక్కడ జరిగిన ఘర్షణ మరింత ఉధృతం కాగానే ఇరవై మంది పోలీసు కానిస్టేబుళ్లు, జి.వి. రాఘవయ్య అనే సబ్ ఇన్స్పెక్టర్ కలిసి వచ్చి, ప్రభుత్వ అధికారులకు, అటవీశాఖ సిబ్బందికి అండగా నిలిచారు. జనం ఆ సుమారు మూడు వందల మంది గుమికూడి పోలీసు పటాలం, ఉద్యోగులమీద రాళ్లు విసిరారు.
రిజర్వు పోలీసులను పిలిపించి కాల్పులు జరిపిస్తానని ఇన్స్పెక్టర్ చేసిన హెచ్చరిక వల్ల ప్రయోజనం కనబడలేదు. అప్పుడు నిజంగానే ఆయన కాల్పులు జరిపించాడు. తొలి రౌండ్ కాల్పుల్లోనే కన్నెగంటి హనుమంతు, మరో ఇద్దరు పౌరులు తూటాలు తగిలి నేలకూలారు. వారిలో హనుమంతరావు, అతని సహాయకుడైన వెల్లంపల్లి శేషుడు కూడా ఉన్నారు. ఈ వార్త విన్న వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ ‘వెర్నర్’ 2 జిల్లా పోలీసు అధికారిని, అదనపు సిబ్బందిని వెంటపెట్టుకుని మించాలపాడు చేరుకున్నాడు. వారు ఆ గ్రామంలో మొత్తం 28 మంది పురుషులు, 9 మంది 1 స్త్రీలనూ అరెస్టు చేశారు.
మరునాడు మరలా కొన్ని అరెస్టులు జరిగాయి. వారంతా రెండు నెలలు మాచర్ల జైలులో ఉన్న తరువాత నరసరావుపేట డెప్యూటీ కలెక్టర్ అయిన జంబునాథ అయ్యర్ ఎదుట వారిని హాజరుపరిచారు. వారికి వివిధ రకాలశిక్షలు విధించడం జరిగింది. అంతకుముందు కోటప్పకొండలో జరిగిన అల్లరులకు కారణంగా చెప్పి చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించినవాడు, తెలుగు విప్లవవీరుడు అన్నాప్రగడ కామేశ్వరరావుకు జీవితంలో తొలిసారిజైలు శిక్ష విధించినవాడు గూడా అదే జంబునాథ అయ్యరు.
మించాలపాడు గ్రామంలో జనం మీద పోలీసులు కాల్పులు జరిపింది ఆరోజు సాయంత్రమైతే, తూటాలు తగిలిన కన్నెగంటి హనుమంతు మృతి చెందినది అర్ధరాత్రి 12 గంటల సమయంలో. అప్పటిదాకా హనుమంతు దగ్గరకు ఎవ్వరినీ పోలీసులువెళ్లనివ్వలేదు. హనుమంతు త్రాగేందుకు మంచినీళ్లు అడిగినా ఇవ్వనివ్వలేదు. అలా కొన్ని గంటలపాటు యాతన అనుభవించిన అనంతరం ప్రాణాలు విడిచాడు పూరీ పుల్లరి పోరాటయోధుడు కన్నెగంటి హనుమంతు.
ఆ మరునాడు ఆయన భౌతిక శరీరాన్ని కోలగుట్ల సమీపంలో పోలీసులే ఖననం చేశారు. ఊరి జనం ఎంతో అభిమానంతో ఆయన సమాధి నిర్మించుకొని ఒక శిలాఫలకం ఏర్పాటుచేయగా, దాన్నికూడా పోలీసులు పగులగొట్టి ఆ ముక్కలను అక్కడక్కడా వెదజల్లారు.
ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ వారు తమ సమావేశంలో తీర్మానం చేసినట్లు, కన్నెగంటి హనుమంతు సమాధివద్ద తిరిగి శిలాఫలకాన్ని ఏర్పాటుచేయడం ఈనాటికీ జరగలేదు మనం ఆ పుల్లరి పోరాట యోధుడికి ఇచ్చిన గౌరవంగా దీన్ని భావిద్దామా ?





