News

నాటో దేశాల సరసన భారత్ కు చోటు : అమెరికన్ సెనేట్ నిర్ణయం

830views

రక్షణ రంగంలో భారత్‌ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్‌ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి. తాజాగా సెనేట్ చట్టం చేయడంతో ఇకపై భారత్‌ కూడా అమెరికా మిత్రదేశంగా ఉండనుంది. ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ లేదా NDDA చట్టం 2020ని గతవారం అమెరికా సెనేట్ పాస్ చేసింది. హిందూ మహాసముద్రంలో భారత్ అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కావడంతో పాటు మానవత్వ సహకారం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, సముద్రతీర ప్రాంతాల్లో భద్రత వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి.

ఇక ఈ బిల్లును హౌజ్‌ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో వచ్చేవారం ప్రవేశపెట్టనున్నారు. జూలై చివరికల్లా దీన్ని ఆమోదింప చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. 2016లో భారత్‌ తమ ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. ఇలా గుర్తించడంతో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జూలై 2018లో ట్రంప్ సర్కార్ భారత్‌కు స్ట్రాటెజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ -1 హోదాను కల్పించింది. దక్షిణాసియాలో ఇలాంటి హోదా ఉన్న దేశాల్లో భారత్ ఒక్కటే కావడం విశేషం. ఈ నిర్ణయంతో భారతదేశానికి అధిక సాంకేతిక ఉత్పత్తి అమ్మకాలకు ఎగుమతి నియంత్రణలను సులభతరం చేస్తుంది.