
ఇన్నాళ్ళూ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు తెర పడనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఇన్నాళ్ళూ భారత్ చేస్తున్న వాదనకి బలం చేకూర్చే సంఘటన అమెరికాలో జరిగింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని అమెరికా ప్రభుత్వం లండన్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకి తెలిపింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ కేంద్రంగా దావూద్ ఉగ్ర కార్యకలాపాలు, డీ-కంపెనీ వ్యవహారాలు జరుగుతున్నాయని అమెరికా పేర్కొంది. అయితే దావుద్ ఇబ్రహీం తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లుగా పాక్ బుకాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దావూద్ సన్నిహితుడు, వివిధ నేరాల్లో పాల్గొని ఇంగ్లాండ్ జైలులో ఉన్న జబీర్ మోతివాలాను అప్పగించాలని కోరుతూ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరిగింది. అమెరికా ప్రభుత్వం తరఫున జాన్ హార్డీ కోర్టులో వాదనలు వినిపించారు. దావూద్ ఇబ్రహీం, అతడి సోదరుడు 1993 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి పారిపోయారని, ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని కోర్టుకి తెలియజేశారు జాన్ హార్డీ.





