News

‘అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ-జాతీయ సెలవుగా ప్రకటించాలి’

253views

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు జాతీయ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓ సాధువు. 2024 జనవరి 22న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన సాధువు మహంత్ అంకిత్ శాస్త్రి మహారాజ్ కోరారు. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం దక్కుతుందని తెలిపారు.

అయోధ్య చరిత్రపై వెబినార్
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో డిసెంబర్ 9 నుంచి ఐదు రోజుల పాటు వెబినార్ను నిర్వహించనున్నారు. 500 ఏళ్ల నాటి రామాలయ చరిత్రను తెలిపేలా ఈ వెబినార్ను నిర్వహిస్తున్నారు అమెరికాకు చెందిన హిందువులు. హిందూ యూనివర్సిటీతో పాటు అమెరికా విశ్వ హిందూ పరిషత్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. 9వ తేదీన అయోధ్య రామాలయాన్ని పునర్నిర్మాణానికి జరిగిన పోరాటంపై భారత పురావస్తు శాఖ రీజనల్ డైరెక్టర్ కేకే మహ్మద్ మాట్లాడనున్నారు. 10న రామాలయ నిర్మాణ చరిత్రపై బీజేపీ ఎంపీ సుధాంశూ త్రివేది ప్రసంగించనున్నారు. జనవరి 6న జరిగే మూడో వెబినార్లో న్యాయ అంశాలపై జ్ఞాన్వాపీ కేసు న్యాయవాది విష్ణు శంకర్ జైన్, 7న ప్రముఖ రచయిత ఆనంద్ రంగనాథన్ మాట్లాడనున్నారు. చివరి వెబినార్ జనవరి 13న నిర్వహించనుండగా, వక్తల పేర్లను మాత్రం వెల్లడించలేదు.