
అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు.
వీరిలో ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణం’లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. వీవీఐపీల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్‌లు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.





