జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ‘జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2023’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బిల్లుల్లోని కీలక అంశాలను సభకు వెల్లడించారు.
గతంలో జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో దాన్ని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్ డివిజన్‌లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మన దేశంలో భాగమేనని ఆయన అన్నారు. అందుకే, అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు. ఇక, కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్ నుంచి వలసవెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్ చేసినట్లు అమిత్ షా తెలిపారు.
కశ్మీర్ బిల్లులతో వారికి న్యాయం..
”70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి” అని అమిత్‌షా వెల్లడించారు.