News

వందేళ్లుగా శునకానికి పూజలు

385views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భైరవ్‌ గుడిలో గత వందేళ్లుగా శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈ విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందని స్థానికుల విశ్వాసం. సుమారు వందేళ్ల క్రితం బులంద్‌శహర్‌లోని సికందరాబాద్‌లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారు. ఆయన ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఉంటూ ఒక కుక్కను పెంచుకున్నారు. దానిని భైరవ్‌ బాబాగా పిలిచేవారు. ఓరోజు బాబా లటూరియా తను నిర్మించుకున్న గుడిలోనే సజీవసమాధి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో భైరవ్‌ కూడా సమాధిలోకి దూకింది. స్థానికులు దాన్ని బయటకు తీశారు. కానీ, కొద్దిసేపటికే అది మరణించింది. అప్పట్నుంచీ భైరవ్‌కు గుర్తుగా ఓ విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఏటా హోలీ, దీపావళి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళ, శనివారాల్లో భైరవ్‌ దర్శనానికి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు.