ArticlesNews

గిరిజన హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా

309views

(నవంబర్‌ 15 – బిర్సా ముండా జయంతి )

గిరిజన హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్‌ గ్రామంలో 1875 నవంబర్‌ 15న సుగుణ ముండా, కర్మిహాట్‌ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్‌గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు.

అప్పట్లో గిరిజన భూములపై బ్రిటిష్‌ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌ వాళ్ల బాధలు పడ లేక చాలామంది గిరిజనులు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి ఇచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా..వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇక పై క్రైస్తవంలోకి ఒక్క గిరిజనుడు కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు.

బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్‌ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్‌’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది గిరిజనులను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన గిరిజనులు బిర్సా ముండాను ‘ధర్తీలబా’ అంటే దేవుడుగా కొలిచేవారు.

తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్‌లో ఉల్‌ గులాన్‌ అంటే తిరుగుబాటు పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని గిరిజనులను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్‌ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది.

ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజనులు ‘భగవాన్‌ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఛోటా నాగపూర్‌ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఇప్పటికీ ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి. తెల్లవాళ్లు వెనక్కి పోవాలి అన్న నినాదం ఇచ్చి బిర్సా మొండా మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. సాత్వికత, ఆధ్యాత్మికత, పరస్పర సహకారం, ఐక్యత, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని ప్రబోధించిన బిర్సా మొండా మనందరికీ ఆదర్శప్రాయుడు.