News

కొత్త ప్రభుత్వం కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి

1kviews

కోట్లాది భారతీయులు మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని పొంది అదృష్టవంతులయ్యారు. ఇది జాతీయ వాద శక్తులకు లభించిన విజయం. ఈ ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మా అభినందనలు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది.

ఈ క్రొత్త ప్రభుత్వం సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలమౌతుందని మేం విశ్వసిస్తున్నాం. ఎన్నికలు ముగిసినందున అందరూ తమ చేదు అనుభవాలను మరచి ప్రజా తీర్పును అత్యంత వినయపూర్వకంగా స్వాగతిస్తారని భావిస్తున్నాం.

ఆంధ్రలో జగన్ కు ఒక్క చాన్సు :

ఒక్క చాన్సు అంటూ జగన్ చేసిన పాదయాత్ర, ప్రచారం మంచి ఫలితానిచ్చింది.  లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం చాలా మటుకు ఊహించినదే అయినా ఇంత భారీ విజయాన్ని మాత్రం బహుశా ఎవరూ ఊహించలేదు. జగన్ పాదయాత్ర, ప్రచారం తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు, 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నేరవేర్చలేకపోవడం, అనుకూల మీడియా దన్నుగా చేసిన అతి చంద్రబాబుపై ప్రజలకు మొహం మొత్తేలా చేసింది. పసుపు కుంకుమ, వృద్దాప్య పించన్ల పెంపు వంటి చర్యల ద్వారా ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతోనే ప్రజలను కొనుగోలు చెయ్యాలని చంద్రబాబు వేసిన ఎత్తుగడ కూడా వికటించింది. ఐదేళ్ళ పాటు కాలయాపన చేసి ఎన్నికల ముంగిట వరాలు కురిపించి, వాటికి తన అనుకూల మీడియా ద్వారా భారీ ప్రచారం ఇప్పించుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు వేసిన పన్నాగం ప్రజల ముందు పారలేదు. ప్రజలు మరింత తెలివిగా ఏమాత్రం బయటపడకుండా నిశ్సబ్దంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓట్లను కుమ్మరించారు. ప్రజలలో నివురు గప్పిన నిప్పులా వున్న ప్రభుత్వ వ్యతిరేకత కార్చిచ్చై చంద్రబాబు ప్రభుత్వాన్ని దహించి వేసింది. ఏ.పీ అసెంబ్లీలో వైకాపా షుమారు 149 స్థానాలు దక్కించుకోబోతుండగా, అధికార తెదేపా కేవలం 25 స్థానాలకే పరిమితం కాబోతున్నది. ఇక వైకాపా 22 పార్లమెంటు స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించనుండగా తెదేపా కేవలం 3 స్థానాలకే పరిమితం కాబోతున్నది. బహుశా ఇంత భారీ విజయాన్ని జగన్ కూడా ఊహించి వుండడు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకున్నారన్న విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

సమర్ధతకే పట్టం :

భారత ప్రజలు సమర్ధతకే పట్టం కట్టారు. తమ వ్యక్తిగత, కౌటుంబిక అవసరాల మాటెలావున్నా దేశ రక్షణ, సరిహద్దుల రక్షణకు పెద్ద పీట వేసే అవినీతి రహిత ప్రభుత్వాన్ని యావద్దేశం మరోసారి కోరుకుంది. దక్షిణాదిలో కర్ణాటకలో ఒకటి మినహా అన్ని స్థానాలను కైవసం చేసుకోబోతున్న భాజపా కేరళ, ఎపీలలో మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోయింది. తమిళనాడులో మాత్రం భాజపా మిత్రపక్షం రెండు చోట్ల ఆధిక్యంలో వుంది. ఇక ఉత్తరాది అంతటా భాజపా ప్రభంజనం కనిపిస్తోంది. అలాగే ఒక వర్గం మీడియా విపరీతంగా ప్రచారం కల్పించిన తుకడే తుకడే గ్యాంగు అసలు ఈ ఎన్నికల్లో అయిపే లేకుండా పోయింది. జాతి వ్యతిరేక  మీడియా కథనాల్లో తప్ప ప్రజల మనస్సుల్లో ఈ తుకడే గ్యాంగు వితండ వాదానికి తావు లేదని తేలిపోయింది. అలాగే అవినీతి వ్యతిరేక పోరాటానికి బ్రాండ్ అంబాసిడర్ గా అదే మీడియా వెలుగులోకి తెచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. భాజపా గుజరాత్, రాజస్థాన్, డిల్లీ, హిమాచల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది. మమతా బెనర్జీ కోట బీటలు వారింది. భాజపా బెంగాల్లో 18 స్థానాల్లో ఆధిక్యంలో వుండడం చెప్పుకోదగ్గ పరిణామం. బీఎస్పీ, ఎస్పీల కలయికతో యు.పి లో భాజపాకు భారీ గండి పడుతుందని కొందరు రాజకీయ పండితులు, మీడియా సంస్థలు చేసిన విశ్లేషణలు తుస్సుమన్నాయ్. యు.పిలో సైతం భాజపా అత్యధికంగా 62 స్థానాలు సాధించబోతున్నది. కానీ 2014 తో పోలిస్తే ఇవి తక్కువ. మొత్తమ్మీద కడపటి వార్తలందేసరికి ఎన్.డీ.ఏ షుమారు 352 స్థానాల్లో, యు.పి.ఏ షుమారు 91స్థానాల్లో, ఇతరులు 99స్థానాల్లోనూ గెలుపు లేదా ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో ప్రజలు కప్పల తక్కెడ వంటి కలగూరగంప ప్రభుత్వాన్ని కాకుండా స్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో కోరుకున్నారనటంలో సందేహం అవసరం లేదు.