
హిందూ సంఘటనే దేశంలోని అన్ని సమస్యలకు వున్న ఏకైక పరిష్కార మార్గమని, అందుకే ఆరెస్సెస్ స్థాపకులు డాక్టర్ హెడ్గెవార్ హిందూ సమాజ సంఘటనే లక్ష్యంగా ఆరెస్సెస్ ను స్థాపించారని ఆరెస్సెస్ సహ క్షేత్ర సంఘచాలక్ (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక) మాననీయ శ్రీ దూసి రామకృష్ణ గారు పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి ఏడాది 20 రోజులపాటు యువకులకు ఇచ్చే శిక్షణలో భాగంగా ఈ సంవత్సరం మే 4 వ తేదీ నుంచి 24వరకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలోని కేశవ నగర్ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ప్రధమ వర్ష సంఘ శిక్షా వర్గ నిర్వహించింది. ఈ రోజు తేది 24/5/2019, శుక్రవారం శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సార్వత్రిక ఉత్సవంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఆరెస్సెస్ వ్యక్తి నిర్మాణం చేస్తుందని, ఈ శిక్షణ వ్యక్తుల నిర్మాణం కోసమేనని ఆయన తెలిపారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే సామాజిక పరివర్తన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. 90 సంవత్సరాలుగా ఆరెస్సెస్ చేస్తున్న కృషి కారణంగా సమాజం ఆరెస్సెస్ ను విశ్వసించి సంఘాన్ని ఆహ్వానిస్తున్నదని అన్నారు. “అద్వేష్టా సర్వ భూతానాం” అని భగవద్గీతలో పేర్కొన్నట్లుగా అందరిలో దైవాన్ని దర్శించడం హిందూ సంస్కృతని, హిందువుకు ఎవరితోనూ వైరం లేదని పేర్కొన్నారు. హిందూ సంస్కృతి విశ్వ కళ్యాణ కారకమని, అలాంటి హిందూ సంస్కృతి రక్షణ అత్యావశ్యకమని శ్రీ రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్ర గారు పాల్గొన్నారు.
శిక్షణ పొందిన స్వయంసేవకులు యోగాసన్, దండ(కర్ర సాము), నియుద్ధ(కరాటే), వ్యాయామ యోగ్ తదితర అంశాలలో చేసిన ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

ఈ శిక్షా వర్గాలో 116మంది 10వ తరగతి పూర్తయిన విద్యార్ధులు, 49మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు, 69మంది డిగ్రీ విద్యార్ధులు, 15మంది పీజీ విద్యార్ధులు, 13మంది ఉపాధ్యాయులు, నలుగురు ఉద్యోగులు, ఇద్దరు వ్యవసాయదారులు, ఐదుగురు చేతివృత్తులవారితో కలిపి మొత్తం 284 మంది పాల్గొన్నారు.
అలాగే ఈ నెల 3వ తారీఖు నుంచి 23వరకు జరిగిన ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ రాజమండ్రిలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరగగా, అందులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 92 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. ఈ శిక్షణ పొందటానికి ప్రధమ వర్ష సంఘ శిక్షావర్గ పూర్తయినవారే అర్హులు. ఈ శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ శ్రీరాం భరత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.





