
అథ్లెటిక్స్ క్రీడల్లో అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు చెన్నై ముస్తాబవుతోంది. ఏకంగా ఒలింపిక్స్ స్థాయి వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేంత తరహాలో ప్రత్యేకంగా క్రీడా నగరం నిర్మించనుంది. ఇందుకోసం చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(సీఎండీఏ) సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వేలు నిర్వహించేందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది.
సీఎండీఏ చేపడుతున్న అధునాతన ప్రాజెక్టు.. గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ. వినూత్న రీతిలో ఈ క్రీడా నగరాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. పాత మహాబలిపురం రోడ్డు(ఓఎంఆర్)లోని సెమ్మంజేరిలో ఇందుకు అనువైన స్థలం ఎంపిక చేశారు. సత్యభామ యూనివర్సిటీ సమీపంలోనే ఈ క్రీడా నగరం రానుంది. చెన్నై సెంట్రల్ నుంచి 28 కి.మీ. దూరంలో ఉంటుంది. ఒలింపిక్స్, ఆసియా, కామన్‌వెల్త్‌లాంటి పెద్దపెద్ద క్రీడోత్సవాలకు వేదికగా నిలిచేందుకు గొప్పగా నిర్మాణాలు, వసతులు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి అనువుగా క్రీడాసంబంధమైన పలురకాల పరిశ్రమల ఏర్పాటుచేసేలా కూడా ప్రణాళికలున్నాయి. రూ.500 కోట్ల నుంచి రూ.1000కోట్ల మేర ఖర్చు చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆలోచనలు చేస్తున్నాయి. నిర్మాణ బాధ్యతల్ని సీఎండీఏ తీసుకుంది.
పర్యావరణహిత ప్రతిపాదనలు
క్రీడా నగరం సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించడంతో పాటు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి టెండర్లు పిలిచారు. ఏజెన్సీ ఎంపికపై ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మొదట్లో స్పష్టత రావచ్చు.
స్టేడియాల, మైదానాల ఆవరణలో పలురకాల ప్రత్యేకతలు తీసుకురానున్నారు. లాన్‌లు, నడకబాటలతో పాటు జీవవైవిధ్యం ఉట్టిపడేలా చర్యలు చేపట్టనున్నారు.
వరదలు సైతం తట్టుకునేలా స్పాంజ్‌పార్కుల్ని తీసుకురానున్నారు. సముద్రానికి సమీపంలోనే స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదిత ప్రాంతం ఉండటంతో విపత్తుల నిర్వహణలకు అనుకూలంగా ఇక్కడ వసతులు రానున్నాయి. ఇందుకోసం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల 2 కి.మీ. మేర పరిసరాల స్థితిగతులపై సర్వే చేయనున్నారు.
క్రీడాగ్రామం వద్ద రాబోయే 30 ఏళ్లలో ట్రాఫిక్‌ను అంచనా వేసి అందుకు తగ్గట్లు రోడ్లు, ఇతర రవాణా వసతులు తీసుకురానున్నారు. పార్కింగ్ స్థలాలు అందుకు తగ్గట్లు ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణాలు పర్యావరణహితంగా ఉండేలా చూడనున్నారు.
దారుల అనుసంధానం..
ప్రతిపాదిత ప్రాంతానికి అనుబంధంగా విమాన, రైల్వే, బస్సు, మెట్రో వసతులు దగ్గర్లోనే ఉండేలా నెట్వర్క్‌ను రూపొందిస్తామని సీఎండీఏ అధికారులు వివరిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి క్రీడాకారులు, ప్రజలు క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా రూట్లను అనుసంధానం చేయనున్నారు. దీనిపైనా సర్వే చేస్తామని వెల్లడిస్తున్నారు. క్రీడానగరం పూర్తి డిజైన్లలో ఐఐటీ మద్రాస్, అన్నా యూనివర్సిటీ, ఎన్‌ఐటీల సహకారం తీసుకోనున్నారు.
స్టేడియాలు.. సదుపాయాలు
ప్రతిపాదిత ప్రాంతంలో 150 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. ప్రధానంగా అథ్లెటిక్స్‌లోని వివిధ క్రీడాంశాలకు సంబంధించిన వనరులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. విభిన్నరీతిలో పలు స్టేడియాలు, అరినాలు, శిక్షణ మైదానాలు, వివిధ క్రీడాంశాలకు సంబంధించిన అకాడమీలకు స్థానం కల్పిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల క్రీడాకారులకు సైతం ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. వసతులతో పాటు బస చేసేందుకు ఏర్పాట్లు ఉండనున్నాయి.





