
బెంగళూరు: కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పేరుతో విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి వివాదానికి తెరలేపుతోంది. రాష్ట్ర వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీరంగపట్టణంలోని టిప్పు సుల్తాన్ సమాధిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిప్పు పేరుతో విద్యాసంస్థ ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో స్వయంగా చర్చిస్తానని వెల్లడించారు.
ఇప్పటికే టిప్పు సుల్తాన్ చరిత్ర, పాలన, మతపరమైన విధానాలపై కర్ణాటకలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన పేరుతో విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చారిత్రక వ్యక్తుల పేర్లతో విద్యాసంస్థలను ఏర్పాటు చేసేటప్పుడు వారి చరిత్రపై సమగ్ర పరిశీలన, సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మరోవైపు టిపు జయంతి వేడుకల అంశంపైనా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం 2013లో అధికారికంగా టిప్పు జయంతి వేడుకలను ప్రారంభించిందని, అయితే తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అనంతరం వాటిని నిలిపివేసిందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం మళ్లీ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తే బీజేపీకి నిరసన తెలిపే అవకాశం కల్పించినట్లవుతుందని వ్యాఖ్యానించారు.
అయితే టిప్పు జయంతిని దేశవ్యాప్తంగా వ్యక్తిగత స్థాయిలో జరుపుకుంటున్నారని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని జమీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఒకవైపు అధికారిక జయంతి వేడుకల నిర్వహణపై వెనుకడుగు వేస్తూనే, మరోవైపు టిపు పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
కర్ణాటకలో ప్రజా ధనంతో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలంటే విద్యా అవసరాలు, ప్రాంతీయ ప్రాధాన్యత, చారిత్రక పరిశోధనకు సంబంధించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం రాజకీయ లేదా మతపరమైన గుర్తింపులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిపు పేరుతో విద్యాసంస్థ ఏర్పాటు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.




