
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డాక్టర్ శివపాల్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందువులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే దుర్గాపూజ, పవిత్ర కన్వర్ యాత్రలను ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాల వల్ల అదనపు ప్రయోజనం లేదని, వాటిని నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలతో కొందరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందని తెలిసినా, తన మనసులోని అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నానని పేర్కొన్నారు.
దుర్గాపూజపై స్పందిస్తూ.. భక్తులు దుర్గాదేవి విగ్రహాలను కొనుగోలు చేసి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారని, అయితే వారం రోజుల అనంతరం అదే విగ్రహాలను మురికి కాలువల్లో పడేస్తారని వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని ఒక ప్రహసనంగా అభివర్ణిస్తూ, ఇలాంటి ఆచారాలకు స్వస్తి పలకాలని సూచించారు.
అదేవిధంగా శివభక్తులు పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చేందుకు సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లే కన్వర్ యాత్రపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 50 కిలోమీటర్లు నడిచి పవిత్ర జలాన్ని తీసుకురావడం వల్ల అదనపు ఆశీర్వాదాలు లభించవని అన్నారు. గ్రామాల్లోనే ఆలయాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
హిందూ సంప్రదాయాల్లో దుర్గాపూజకు, శివభక్తుల కన్వర్ యాత్రకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. తరతరాలుగా భక్తులు విశ్వాసంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మత విశ్వాసాలు, సంప్రదాయాలపై ప్రజాప్రతినిధులు చేసే వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చకు ఈ పరిణామం దారితీసింది.




