News

ముస్లిం వరులకు హిందూ పేర్లు.. ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన

0views

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే మతానికి చెందిన ఇద్దరు యువకులతో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే పెళ్లి ఆహ్వాన పత్రికల్లో వరుల పేర్లు అనిల్, సంజయ్‌గా ఉండటంతో వివాదం చెలరేగింది. ముస్లిం యువకులకు హిందూ పేర్లు ఉండటంపై కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు వివాహాన్ని అడ్డుకుంటామంటూ బెదిరింపులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పెళ్లి వేడుకకు భద్రత కల్పించారు.

సహారన్‌పూర్ జిల్లా గంగోహ్‌కు చెందిన ముస్లిం కుటుంబంలోని ఇద్దరు యువతులకు హర్యానాకు చెందిన ఇద్దరు ముస్లిం యువకులతో వివాహ సంబంధాలు కుదిరాయి. వరులిద్దరూ కజిన్స్ కావడం విశేషం. వివాహం కోసం తమ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా గంగోహ్‌కు చేరుకున్నారు. అయితే వెడ్డింగ్ కార్డుల్లో వరుల పేర్లు అనిల్, సంజయ్‌గా ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానికంగా చర్చ మొదలైంది.

ఈ వ్యవహారం హిందూ సంఘాల ప్రతినిధుల దృష్టికి వెళ్లడంతో హిందూ సురక్షా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రోహిత్ ప్రధాన్ మరో వ్యక్తితో కలిసి పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ నిర్వాహకుడికి ఫోన్ చేశారు. హిందూ పేర్లతో ఉన్న ముస్లిం యువకుల వివాహ బుకింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిఖాను అడ్డుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో వధూవరుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

ఈ వివాదంపై వరుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తమ కుటుంబాల్లో హిందూ పేర్లు పెట్టుకునే సంప్రదాయం 1947 దేశ విభజన కాలం నుంచి కొనసాగుతోందని వివరించారు. అప్పట్లో తమ పూర్వీకులు నివసించిన ప్రాంతంలోని హిందూ కుటుంబాలు వారి ముస్లిం గుర్తింపును దాచిపెట్టి, వారిని హిందువులుగా పరిచయం చేస్తూ ప్రాణాలు కాపాడాయని తెలిపారు. ఆ సమయంలో హిందూ కుటుంబాలు చూపిన మానవత్వం, సోదరభావానికి గుర్తుగా తమ కుటుంబాల్లో పిల్లలకు హిందూ సంప్రదాయాల ప్రకారం పేర్లు పెట్టడం ప్రారంభించినట్లు వెల్లడించారు.

మరోవైపు వివాహాన్ని అడ్డుకుంటామని బెదిరించిన వ్యక్తులపై వధువుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి వేడుకకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా భద్రత కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు ఫంక్షన్ హాల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

చివరకు పోలీసుల భద్రత మధ్య అనిల్, సంజయ్‌లతో ఇద్దరు ముస్లిం సోదరీమణుల వివాహాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. 1947 దేశ విభజన సమయంలో తమ పూర్వీకులకు అండగా నిలిచిన హిందూ కుటుంబాల మానవీయ సహాయాన్ని గుర్తుచేసుకుంటూ కొనసాగిస్తున్న పేర్ల సంప్రదాయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.