
విశాఖపట్నం: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పెరుగుతున్న మధుమేహ ముప్పును ముందుగానే నియంత్రించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని పతంజలి యోగా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పతంజలి యోగా సమితి–విశాఖ శాఖ ఆధ్వర్యంలో ప్రీ-డయాబెటిస్ నివారణపై ప్రత్యేక యోగా, ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
శనివారం ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మర్రిపాలెంలోని బాపూజీనగర్ యోగా కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. బాపూజీనగర్, జ్యోతినగర్ యోగా కేంద్రాల సభ్యులతో పాటు స్థానికులు కలిపి సుమారు 40 మంది శిబిరంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ దేముడు బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా గురువు ఆర్. గణపతి రావు ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు. మధుమేహం బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నిత్య యోగా సాధన ప్రాధాన్యత, సమతుల ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి వంటి అంశాలపై పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు.
ప్రీ-డయాబెటిస్ దశలోనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిర్వాహకులు వివరించారు. యోగా సాధనతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, వైద్యుల సూచనలను పాటించడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన బాపూజీనగర్ యోగా కేంద్రం సభ్యులు విజయమూర్తి, రామారావులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.




