
( సెప్టెంబర్ 10 – కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి )
ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహాకవులు చరిత్రలో ఉన్నా, ఒకడు ‘నాచన సోమన’ అని ఆయనే అన్నట్లుగా, ఆధునిక యుగంలో ‘ఒకడు విశ్వనాథ’. కవిసార్వభౌముడు అనగానే శ్రీనాథుడు, కవిసమ్రాట్ అనగానే విశ్వనాథుడు తెలుగువారికి గుర్తుకువచ్చి తీరుతారు. కావ్యాలు, నాటకాలు, శతకాలు, నవలలు, కథలు, పీఠికలు, వ్యాసాలు, గీతాలు, చరిత్రలు, విమర్శలు ఇలా పుంఖానుపుంఖాలుగా రాసిన ఆధునిక యుగ కవి ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప ఇంకొకరు లేరు. ఎన్ని రచనలు చేపట్టారో, అంతకు మించిన ప్రసంగాలు చేశారు. ఇంతటి కీర్తి ఇంకొకరికి అలభ్యమనే చెప్పాలి. 1985 సెప్టెంబర్ 10న కృష్ణాజిల్లాలోని నందమూరులో పార్వతమ్మ, శోభనాద్రి సత్యనారాయణ దంపతులకు జన్మించారు. ఆయన తన 81వ ఏట అంటే 1976 అక్టోబర్ 18న శివైక్యం చెందారు. విశ్వనాథ సత్యనారాయణ భౌతికంగా మన మధ్య లేకపోయినా సాహిత్యలోకం ఆయన్ని వీడలేదు, వీడజాలదు.
సామాజిక స్పృహలో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్థ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. అలాంటి అరుదైన శక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను విశ్వనాథ సత్యనారాయణ తన రచనలలో పొందుపరిచి వాటిని సమాజంలోని మార్పులకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగించారు. సమాజ జీవన పరిస్థితులను నిర్మొహమాటంగా వివరిస్తూ, వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ ఎందరికో ఫీజులు కట్టి, ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి విద్యాదానం చేసిన మహనీయులు. పైకి కోపంగా కనిపించినా, గర్వంగా అనిపించినా లోపల మెత్తని మనిషి ఉన్నాడని విశ్వనాథతో పరిచయం ఉన్నవాళ్లు తరచూ చెబుతుంటారు.
బహుభాషావేత్త పివి. నరసింహారావుకు విశ్వనాథ నవలాశిల్పం అంటే ఎంతో ఇష్టం. అందుకే వేయిపడగలు నవలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి ఆయనే స్వయంగా అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడిన వారు. భారతీయత మీద, తెలుగుదనం మీద అభిమానం కలిగినవారు. శ్రీశ్రీ వంటి వారు ఛాందసవాదిగా తనను అభివర్ణించినా సాహిత్యంలో జాతీయభావము, ఆరోగ్యవంతమైన ప్రాంతీయ భావము ప్రస్ఫుటించాలని విశ్వనాథవారు గాఢంగా విశ్వసించారు. దానినే ఆయన తన రచనల్లోనూ, మాటల్లోనూ ప్రకటించారు. శిల్పం కానీ సాహిత్యం కానీ విజాతీయమై ఉండరాదని, ఖచ్చితంగా జాతీయమే అయి ఉండాలని నొక్కి వక్కాణించారు. ‘‘పక్షి సముద్రంపై ఎంత ఎగిరినా రాత్రికి ఏ విధంగా అయితే గూటికి చేరుతుందో..అలాగే మనం మన జాతీయత, సాంప్రదాయాలను కాపాడుకోవాలి’’, అనే వారు. విశ్వనాథ చాలాకాలం తనను వెంటాడారని మహాకవి శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నారు. విశ్వనాథను ‘కవికుల గురువు’ అని అభివర్ణించారు. కవికుల గురువు అనేది కాళిదాసుకు పర్యాయపదం. శ్రీశ్రీ దృష్టిలో విశ్వనాథ ఆధునిక యుగంలో అంతటి గురు స్థానీయులు.
విశ్వనాథ వారు తమ జీవితకాలంలో ప్రపంచంలోనూ, దేశంలోనూ, తన రాష్ట్రంలోనూ సాగుతున్న సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, మత, నైతిక రంగాల ఉద్యమాలన్నింటినీ అధ్యయనం చేసి వాటికి తన స్పందనలను, ప్రతి స్పందనలను తన సాహిత్యంలో రికార్డు చేసిన వివేకజ్ఞులు. ‘‘నేను ఏమి రాస్తానో తెలిసే రాస్తాను’’ అని చెప్పుకున్న జ్ఞాతశిల్పి. స్వాతంత్రోద్యమం, రష్యన్ విప్లవం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆంధ్రోద్యమం, చరిత్రాధ్యయనోద్యమం, తాత్త్విక ఆధ్యాత్మికోద్యమం, పునరుజ్జీవనోద్యమం, సంస్కరణోద్యమం, భాషోద్యమం, నాస్తికవాదం, జానపద చైతన్యోద్యమం, పర్యావరణ పరిరక్షణోద్యమం ఇలా ఎన్నో ఉద్యమ చైతన్యాలపై విశ్వనాథ వారు స్పందించారు. సమకాలీనోద్యమాలకు సమగ్రంగా స్పందించి తన దృక్పథాన్ని నిర్భయంగా నిజాయితీతో చెప్పిన ఋజువర్తనులు.
రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు రెండూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నిర్మించిన మహా సారస్వత సౌధాలు. తెలుగు సాహిత్య లోకానికి మొదటి జ్ఞానపీఠ పురస్కారం ఆయనే సంపాదించి పెట్టారు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అత్యున్నతమైన గౌరవాలు పొందారు. డి.లిట్ కైవసం చేసుకున్నారు. కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి పదవి కూడా విశ్వనాథను వరించింది. ఎన్ని తరాలు తరిగినా, ఎన్ని యుగాలు గడిచినా ఈ భూమి మీద తెలుగు భాష జీవించి ఉన్నంతవరకు, తెలుగుజాతి మనుగడ సాగించినంతవరకు తెలుగువారి గుండెల్లో విశ్వనాథవారు సజీవంగా వెలుగులు ప్రసరిస్తూనే ఉంటారు.





