News

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు.. చంద్ర‌ఘంటాదేవిగా భ్ర‌మ‌రాంబ‌.. రావ‌ణ భుజ‌స్కంధాల‌పై శ్రీశైలేశుడు

325views

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్ర‌ఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆది పరాశక్తుల్లో తృతీయ రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కందాలపై విహరిస్తూ భక్త జనాన్ని అలరింప జేశారు.

దేవి సాయంత్రం భ్రామరీ అమ్మవారిని పరాశక్తి రూపాల్లో మూడవ ఆవతారమైన చంద్రఘంటాదేవి రూపంలో అలంకరించి అమ్మవారిసింహ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ దేవి పది చేతులతో కుడి వైపు పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాల, ఎడమ వైపు త్రిశూలం, గద, ఖఢ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రశాంత వదనంతో శాంతరూపిణిగా ఉన్నా చంద్ర‌ఘంటాదేవి యుధ్దోన్ముఖురాలై ఉంటుంది. ఈ అమ్మవారు తలపై అర్ద చంద్రుడుని ఘంటాకారంలో ధరించడంతో చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారిని పూజించడం వలన భక్తుల కష్టాలు తీరుతాయని, ఈ దేవి ఆరాధన వలన సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన రావణవాహనసేవపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

బుధ‌వారం కూష్మాండ దుర్గ అలంకారంలో ద‌ర్శ‌నం

శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజు బుధ‌వారం భ్రమరాంబాదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో కనిపిస్తారు. మల్లికార్జున స్వామి కైలాస వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో పెద్దిరాజు తెలిపారు. కూష్మాండ దుర్గను ఉపాసంచడం వల్ల రోగాలు, శోకాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరి ఆయువు యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.