వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెరటాశి మాసంలో రెండవ శనివారంతో పాటు శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం మొదలుకొని, మాడవీధులు, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. గదులకు కూడా డిమాండ్ పెరిగింది. ఒక గదిని పొందేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. గదులు లభించని చాలామంది యాత్రికులు ఫుట్‌పాత్‌లపై, కార్యాలయాల ముందు, చెట్ల కింద, షెడ్లలో సేదదీరారు.
కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో రెండు నడక మార్గాలు రద్దీగా మారాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ నారాయణగిరి ఉద్యానవనాల నుంచి రింగురోడ్డులో శిలాతోరణంగా మీదుగా నందకం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 48 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. తిరుమలకు వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాహనాలను తిరుమలలోకి రాకుండా రింగురోడ్డు ద్వారానే పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించారు.
ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో పెరిగిన రద్దీని దృష్ట్యా ఎస్‌ఎస్‌డీ (స్లాటెడ్ సర్వదర్శనం) టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. పెరటాశి మాసం నేపథ్యంలో అక్టోబరు 1, 7, 8, 14 తేదీల్లో టోకెన్ల జారీని తిరుపతిలో రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ తెలిపింది.