
సుప్రసిద్ధ పళని స్వామి దేవాలయానికి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.4 ఎకరాల భూమిని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపుతోంది. 2 కోట్ల రూపాయలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం… ఈ భూమిని ప్రస్తుతం భక్తుల కోసం ఉచిత పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారు. భక్తులతో సహా అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ, ఇదే భూమిని 2026 జూలై 6న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేశారు.
కొందరు అధికారులు దీనిపై స్పందించారు. బాలసముద్రానికి చెందిన కుప్పుసామి మణియక్కర్ అనే వ్యక్తి 1888లో ఈ 1 ఎకరా 40 సెంట్ల భూమిని దండాయుధపాణి స్వామి ఆలయానికి బహుమతిగా ఇచ్చారు. హిందూ మత సూత్రాలను ప్రచారం చేయడానికి ఒక మఠాన్ని నిర్మించే నిర్దిష్ట ఉద్దేశంతో ధర్మశాసనం (ధార్మిక పత్రం) ద్వారా ఈ విరాళం ఇచ్చారు. ఈ భూమి పబ్లిక్ ట్రస్ట్ ఆస్తి అయినందున, ఎలాంటి పరిస్థితుల్లోనూ దీనిని విక్రయించడంగానీ లేదా పరాయీకరణ చేయడంగానీ వీలుపడదని ఆ పత్రంలో స్పష్టంగా పేర్కొనబడింది” అని తెలిపారు.
అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే..పళని సబ్ రిజిస్ట్రార్ వేరే చోటికి బదిలీ అయినప్పుడు, అక్కడ విధుల్లోకి వచ్చిన మరో అధికారి జూలై 6న ఈ భూమిని ఇద్దరు వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేశారు.
ఈ అక్రమ లావాదేవీ గురించి తెలిసిన భక్తులు, ఇది మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం కావడంతో దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “పళని ఆలయ పరిపాలనా యంత్రాంగం ఈ భూమిని సంరక్షించడానికి 2025 సెప్టెంబర్‌లో తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుండి యాత్రికుల కోసం ఉచిత పార్కింగ్ ప్రాంతంగా నిర్వహిస్తోంది. ఈ ఆస్తికి ఆలయమే సరైన నిర్వాహకురాలనే చట్టపరమైన హోదాను పళని ప్రిన్సిపల్ సబార్డినేట్ కోర్టు, మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టుతో సహా పలు కోర్టులు సమర్థించాయి. ఈ భూమి పబ్లిక్ ట్రస్ట్ ఆస్తి అని, దీనిని ప్రైవేట్ వ్యక్తులు క్లెయిమ్ చేయలేరని ఈ కోర్టులు ధృవీకరించాయి” అని పేర్కొన్నారు.
అదనపు బాధ్యతల్లో వున్న సబ్ రిజిస్ట్రార్, మద్రాస్ హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, పత్రాలను, ఇతరత్రా వాటిని ఏమాత్ర పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా రిజస్టర్ చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ను సవాలు చేస్తూ పళని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మారిముత్తు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. మోసపూరిత పత్రాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు రిజిస్ట్రేషన్‌కు బాధ్యుడైన సదరు అధికారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సహాయక పత్రాలతో కూడిన వివరణాత్మక నివేదికను చెన్నైలోని రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు కూడా సమర్పించారు.
source – organiser





