
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ ప్రజలను ఏకం చేసేలా వీటిని నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థను ఆయన కొనియాడారు.
‘మానవాళిని ఒక్కటి చేయడంలో ఇది విభిన్నమైన కార్యక్రమం. ఈ వేదికపై నుంచి ఇస్తున్న శాంతి, సామరస్య సందేశాన్ని.. ఇంతకంటే గొప్పగా మరెక్కడా చెప్పలేరు. గొప్ప ఆధ్యాత్మిక గురువుగా శ్రీశ్రీ రవిశంకర్ మనకు తెలుసు. కానీ, శాంతిని ప్రేమించే సమాజాన్ని నిర్మించడానికి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు, అవిశ్రాంత ప్రయత్నాలను చూస్తే.. ఓ చరిత్ర సృష్టించిన వ్యక్తిగా శ్రీశ్రీ రవిశంకర్ నిలుస్తారు. ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలను చూస్తుంటే.. 1983లో స్వామి వివేకానంద చికాగోలో నిర్వహించిన విశ్వమత ప్రతినిధుల సభ గుర్తుకొస్తోంది’ అని వివరించారు. ఇక రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల వేదికగా నిర్వహించడం విశేషం.