
జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ముగ్గురు ప్రచురణ కర్తలను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసింది. ‘పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్’ అనే పుస్తకంలో తీవ్రవాదులు, వేర్పాటువాదులను కీర్తిస్తూ వీరు ప్రచురించారు. ఈ పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలకు చేరుకున్నాయి. దీంతో జాతీయవాదులు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఈ ముగ్గురు ప్రచురణ కర్తలను అరెస్ట్ చేసింది. ఈ పుస్తకం తీవ్రవాదులు, వేర్పాటువాదులను కీర్తిస్తూ అతివాద భావజాలాన్ని ప్రచారం చేస్తోందని సీఐజే ఆరోపిస్తోంది. అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు కాగా.. మరొకరు జమ్మూకు చెందిన వ్యక్తిగా కేసు దర్యాప్తు అధికారులు తెలిపారు.
అరెస్టు అయిన ముగ్గురు ప్రచురణకర్తలలో ఒబెరాయ్ బుక్ సర్వీస్‌కు చెందిన ఇందర్‌పాల్, నోయిడాకు చెందిన డామినెంట్ పబ్లిషర్స్‌కు చెందిన అమర్‌దీప్ సింగ్, గిరీష్ అరోరా ఉన్నారు. గతంలో ఒబెరాయ్ బుక్ సర్వీస్, డామినెంట్ పబ్లిషర్స్ రెండింటినీ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసింది. జూలై 6న కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు వారి కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి.
తీవ్ర అభ్యంతరకరమైన కంటెంట్” ఉన్నట్లుగా భావిస్తున్న పుస్తకాల ప్రచురణ, పంపిణీపై జరుగుతున్న విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. ఈ మెటీరియల్‌ను ముద్రించడంలో, పంపిణీ చేయడంలో ప్రచురణకర్తల పాత్రను పరిశోధకులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, వేర్పాటువాదులను, ఉగ్రవాదులను కీర్తిస్తూ అభ్యంతరకరంగా ఉన్న ఈ పుస్తకాలను ఎంపిక చేయడానికి బాధ్యులైన సమగ్ర శిక్షా (Samagra Siksha) కు చెందిన ఏ ఒక్క అధికారిని కూడా అరెస్ట్ చేయలేదు. అయితే, సమగ్ర శిక్షాకు చెందిన ఇద్దరితో పాటు పాఠశాల విద్యాశాఖకు చెందిన పలువురు కలిపి మొత్తం ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేశారు.





