ArticlesNews

నేడే బుద్ధ జయంతి

1.4kviews

బుద్ధుడు ప్రసిద్ది చెందిన దశావతారాలలో ఒక అవతార పురుషుడు. బౌద్ధమత ప్రవక్త గౌతమ బుద్ధుడు. బుద్ధః శబ్దం చేత గౌతమ బుద్ధుడితోపాటు అతని అవతారాలను కూడా గ్రహించాలి. క్రీ. పూ 463వ సంవత్సరంలో కపిలవస్తు రాజైన శుద్దోదనునకు, పట్టపు రాణి మాయా దేవికి లుంబిని వనమున జన్మించిన బాలుడే సిద్దార్ధుడు. ఆయన భార్య పేరు యశోధర. రాహులుడు ఆయన పుత్రుడు. ఆయన ఒకసారి వార్ధక్యంతో బాధపడేవారిని, రోగగ్రస్తుడిని, మృతి చెందిన వానిని, ఒక సన్యాసిని చూసి భూత దయ కలిగి వైరాగ్యం పొందాడు. రాజ భోగాలను వదిలి అంతఃపురాన్ని విడచిపెట్టి వెళ్ళాడు. దానినే మహాభినిష్క్రమణం అంటారు. చాలా సంవత్సరాలు తపస్సు చేసినా మనశ్శాంతి లభించలేదు. చివరికి గయ వద్ద ఒక రావిచెట్టు క్రింద కూర్చుని తపస్సు చేస్తుండగా వైశాఖ పూర్ణిమ నాడు మానవ జాతి దుఃఖాన్ని నివారించే మార్గం స్ఫురించి జ్ఞానోదయం అయింది. ఆనాటి నుండి సిద్దార్ధుడు బుద్ధుడయినాడు. ఆ వృక్షము కూడా బోధి వృక్షమయింది. పినతల్లి గౌతమి చేత పెంచబడుటచే గౌతమ బుద్ధుడయినాడు.

బుద్ధుడు వారణాసి సమీపాన సారనాథ్లో తన మొట్టమొదటి ధర్మోపదేశం చేశాడు. అక్కడ అతనికి కౌండిన్య, బప్ప, బద్దియ, మహానాధ, అశ్వజిత్ లనే అయిదుగురు సన్యాసులకు జ్ఞానోపదేశం చేశాడు. అదే “ధర్మచక్ర ప్రవర్తన”గా పేరు పొందింది. వారు బుద్ధునకు శిష్యులయినారు. బుద్ధుడు వారికందరికీ దీక్ష ఇచ్చాడు. బుద్ధుడు తన శిష్యులకు కూడా దీక్షను ఇచ్చే అధికారం ఇచ్చాడు. ఏ వ్యక్తికయినా బౌద్ధ మతం స్వీకరించడానికి అర్హత కల్పించాడు. ఆరామాలలో జాతి, మత, కుల, లింగ భేదములు లేకుండా చేశాడు. “కిస గౌతమి” అనునమె తన బిడ్డ మరణించగా శోకిస్తూ బుద్ధుని శరణువేడగా మరణమే లేని ఇంటి నుండి ఒక ఆవగింజ తీసుకురమ్మని చెప్పి ఆమెకు జ్ఞానోదయం కలిగించాడు. బౌద్ధ మత దీక్ష తీసుకునేవారు “బుద్ధం శరణం గచ్ఛామి – ధర్మం శరణం గచ్ఛామి – సంఘం శరణం గచ్ఛామి” అనే త్రిశరణ మంత్రం పఠించాలని చెప్పాడు.

బుద్ధుడు ఉన్నత పదవిని పొందటానికి ఐదు వందలకంటే ఎక్కువ జన్మలు ఎత్తాడని “బుద్ధుడి జాతక కధలు” అనే గ్రంధాన్ని బట్టి తెలుస్తోంది. బుద్ధుడు మానవుడు తన స్వయం కృషి చేతనే లక్ష్యసిద్ధిని పొందవచ్చు అని చెప్పాడు. దుఃఖం, దుఃఖ హేతువులు, దుఃఖ నిరోధం, నిరోధనోపాయాలు అనే నాలుగు అక్షర సత్యాలను బుద్ధుడు బోధించాడు. అలాగే బుద్ధుడు ఆరోగ్య మార్గాన్ని కనుగొని 1) సమ్యక్ దృష్టి లేదా విశ్వాసము 2) సమ్యక్ ఆలోచన 3) సమ్యక్ వాక్కు 4) సమ్యక్ క్రియ 5) సమ్యక్ జీవనము 6) సమ్యక్ శ్రమ 7) సమ్యక్ నిశ్చయం 8) సమ్యక్ ధ్యానం అనే అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. బుద్ధుని బోధనలలో “అహింసా పరమోధర్మః” అనేది ప్రధానమయినది. ఈ అహింసా సిద్ధాంతాన్ని అతడు పాటించి, విశ్వ మానవ ప్రేమను చాటి తాను చెప్పినది ఆచరించి ప్రజలకు మార్గదర్శకుడై విశ్వమానవ కళ్యాణానికి దోహదం చేశాడు.