
అచ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే వారసత్వంగా భావిస్తుంటారు. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం , “ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్” అని కూడా అంటారు.
ప్రతి ఒక్కరి బాధ్యత
వారసత్వ స్థలాలు, కట్టడాలను భద్రపరిచి భావి తరాలకు అందించడం ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత. వారసత్వ ప్రదేశాలను గుర్తించడమే కాదు! వాటి ప్రాముఖ్యత, ఔన్నత్యాన్ని చాటుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే?
ఏదైనా ప్రాంతం, నిర్మణానికి ఉన్న ప్రత్యేకత, అసాధారణ సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ, సహజ ప్రాముఖ్యత ఆధారంగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) గుర్తింపు కల్పిస్తుంది. జాబితాలో చేర్చి వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు ఇస్తూ పరిరక్షణకు చర్యలు చేపడుతోంది. యునెస్కో గుర్తించిన ప్రదేశాలు మానవాళి ఉమ్మడి వారసత్వం. కట్టడాలు మాత్రమే కాకుండా, కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు సైతం యునెస్కో గుర్తింపు దక్కింది.
కళలు, సంప్రదాయాలు, వృత్తి నైపుణ్యాలు, చారిత్రక కట్టడాలు, స్థలాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ పలు కట్టడాలను “ఆదర్శ స్మారకాలు”గా గుర్తించింది.
కడప జిల్లాలో కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో 21 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒంటిమిట్ట రామాలయం, జమ్మలమడుగు, నందలూరు, సిద్దవటం, ఎర్రగుంట్ల, వల్లూరు, చెన్నూరు, పెద్దముడియం, రాజంపేట మండలాల్లో రాజుల కాలంలో నిర్మించిన కట్టడాలున్నాయి.
మహిమాన్విత దివ్య క్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం, జమ్మలమడుగు మండలంలోని గండికోట ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సిద్దవటంలో 35 ఎకరాల మైదానంలో నిర్మించిన కోట, పెన్నానది ఒడ్డున పుష్పగిరి క్షేత్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పెన్నానది తీరంలో జమ్మలమడుగు మండలంలో మహోన్నత జైన క్షేత్రం దానవులపాడు చరిత్రలో ఓ వెలుగు వెలిగింది. నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం చారిత్రక, వారసత్వ సంపదగా వెలుగొందుతోంది





