
విశాఖపట్నంలో 50 ఏళ్ల పాటు నిస్వార్ధంగా వైద్యసేవలందిస్తోన్న వివేకానంద మెడికల్ ట్రస్ట్ వారి వివేకానంద డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ అత్యాధునిక ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే హాజరుకాగా గౌరవ అతిధిగా ఆర్ఎస్ఎస్ సహక్షేత్ర సంచాలక్ దూసి రామకృష్ణ, స్ధలదాత ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హోసబళే మాట్లాడుతూ, నిస్వార్ధ సేవాసంస్ధగా 5 దశాబ్దాలుగా వివేకానంద మెడికల్ ట్రస్ట్ సేవలందిస్తూ వచ్చింది.ఈ సేవా ప్రయాణం సామాన్యమైనది కాదు. ఒక సమున్నత లక్ష్యం వుంటబట్టే సుధీర్ఘకాలం సేవలందించడం సాధ్యమైందని, నిస్వార్ధంగా సేవలందించే సంస్ధలే నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆశయం కేవలం సేవ మాత్రమే కాదని సమాజానికి తిరిగివ్వగలిగే మానవ వనరులను తయారు చేయడమని నైతికంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా సమాజాన్ని పునరుద్దరింపజేయాలన్నారు. అంతర్గతంగా మన సమాజంలో సేవ భావం దాగి ఉందని ఇటువంటి లక్షణాలను కలిగిన సమాజాన్ని గుర్తించి కాపాడుకోవాలన్నారు.
సేవ , త్యాగం అన్నవి కవల పిల్లల లాంటివి. ఆర్ఎస్ఎస్ కు పూర్తిస్ధాయిలో కట్టుబడి వున్న వ్యక్తి స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఆయన దాన గుణం ఎనలేనిది. వారు ట్రస్ట్ కు అందజేసి చేసిన స్ధలంలో నిర్మాణమైన ఈ ఆసుపత్రి భవనం భవిష్యత్తులో ఆయన ఆశయాలు నిలబెట్టే రీతిలో సేవలందించాలన్నారు. స్వయంసేవకులు దేశవ్యాప్తంగా ఒక లక్ష సేవా ప్రాజెక్టుల్లో వున్నారని 128 రకాల సేవాకార్యక్రమాల ద్వారా దేశానికి దోహదపడుతున్నారని చెప్పారు.
సేవల నుంచి ప్రయోజనం పొందిన వారు తరిగి సమాజానికి ఎంతో కొంత చేయాలనన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు దేశంలో 3లక్షల వున్నాయని కానీ వాటిలో 3 వేలు మాత్రమే అక్రిడేషన్ కలిగినవి అవడం ఇది బాధాకరమని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాల్సిన అవసరం వుందని, అది ప్రజల హక్కు వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా అది నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక ఆదర్శ వైద్య పరిశోధనా అభివృద్ది సంస్ధగా భవిష్యత్తులో ఈ సంస్ధ సేవలు ఎంతో అవసరం, విద్యాసంస్ధలు డిగ్రీలు ఇచ్చే సంస్ధలుగా మాత్రమే కాకుండా విలువలు నేర్పించాలి. నాణ్యమైనజీవన పరిస్ధితులను భావితరాలకు అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్ధల దాత ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ మాట్లాడుతూ, నోబెల్ బహుమతి పొందే స్ధాయికి వివేకానంద మెడికల్ ట్రస్ట్ తన వైద్య పరిశోధనా విభాగాన్ని అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు. కొలాబరేటివ్ అప్రోచ్ లో కూడా పరిశోధనలు కొనసాగాలని, హోమియోపతిలో రామన్ ఎఫెక్ట్ కూడా చేస్తున్నారని రిసెర్చ్ ల్యాబ్ లు అభివృద్ధి కణాలమీద పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయన్నారు.





