News

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

213views

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన అయిదుగురు యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. పెద్దఎత్తున ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి యత్నించగా ఆరు స్థానిక క్లబులు, మీరా పైబిస్‌ సంస్థ పిలుపు మేరకు ప్లకార్డులను ధరించి, నినాదాలు చేస్తూ కదం తొక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. పొరొంపట్‌, తూర్పు ఇంఫాల్‌, సింగ్జామై పోలీసు స్టేషన్లు, క్వాకైథెల్‌ పోలీసు అవుట్‌ పోస్టుల ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను రద్దు చేశారు. అధునాతన ఆయుధాలు, భద్రతా బలగాల యూనిఫాంలతో తిరుగుతున్న అయిదుగురు యువకులను ఈ నెల 16న మణిపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి, పోలీసు కస్టడీకి తరలించారు. ఆ అరెస్టుతో స్థానికంగా నిరసనలు మొదలయ్యాయి. నిందితులను విడిచిపెట్టాలంటూ.. మంగళవారం నుంచి 48 గంటల లాక్‌డౌన్‌ పాటించారు. ఈ క్రమంలోనే ఆయా సంఘాల పిలుపుతో గురువారం మహిళలు సహా వందలాది మంది నిరసనకారులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లోని ఆయా పోలీస్‌ స్టేషన్‌ల ముట్టడికి యత్నించారు. వారిని భద్రతా బలగాలు నిలువరించాయి.