
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపిపై ఆలయ పూజారులు, సిబ్బంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. స్వామివారికి సమర్పించ వలసిన నిత్య కైంకర్యాలకు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. భక్తుల ఎదుటే పూజారులను, సిబ్బందిని గౌరవం లేకుండా తీవ్రమైన పరుష పదజాలంతో దుర్భాషలా డుతున్నారని,తమ మనోభావాలు దెబ్బతినేల కించపరుస్తున్నారని,ఓ లేఖపై రాసి EO గోపీకి అందచేసి వెళ్లిపోయారు.మే 4వ తేదీ నుంచి పూర్తిగా కొండ పైనా క్రింద స్వామివారికి నిత్య కైంకర్యాలు, విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.
అదే విధంగా స్వామి వారి కైంకర్యాలకు స్వామివారి ఆభరాణాలకు, భక్తులు అందించే కానుకులకు భద్రత లేకుండా పోవడంతో తమ మనసులో అశాంతి నెలకొని అభద్రత భావంతో ఉన్నామని పూజారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆగమ సాంప్రదాయానికి విరుద్ధంగా తమ చేత స్వామి కార్యక్రమాల విషయంలో భయపెట్టి బెదిరించి కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ తిరుగుబాటులో ఆలయ ప్రధాన అర్చకులు కొండ కావూరి అప్పయ్య గురుకుల్, పూజారులు రంగవద్ద్యుల కిరణ్ కిషోర్ శర్మ, ఫణింద్ర దుర్గ, రామకృష్ణ వేద వ్యాస్, కే సత్యం, కెవి సుబ్రహ్మణ్యం, అలానే ఆలయ సిబ్బంది కొండయ్య, నాగిరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు విధులు బహిష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ర్చకుల ఆరోపణలను ఆలయ ఇఒ వేమూరి గోపి ఖండించారు. అర్చకులతో తాను అనుచితంగా ప్రవర్తించలేదని, దుర్భాషలాడలేదని తెలిపారు. నిబంధనల మేరకు పని చేయాలని మాత్రమే ఆదేశించానని చెప్పారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు డిప్యూటీ ఇఒ చంద్రశేఖర్రెడ్డి చర్చిస్తున్నారని, యాత్రికుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఓ వైపు ఈవో మరో వైపు అర్చకులు పట్టిన పట్టు విడువకపోవడంతో కోటప్పకొండలో కైంకర్యాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామి వారి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా గుర్తింపు పొందింది. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతీ రోజూ వస్తూంటారు. అయితే ఈవోకు.. అర్చకులకు ఈ మధ్య కాలంలో ఏర్పడిన వివాదాలతో సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎవరూ తగ్గకపోవడంతో పూజాధికాలకూ సమస్యలు ఏర్పడ్డాయి.